ముప్పై ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న వేములవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్
వేములవాడ నేటిధాత్రి
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిస్థితి ఏర్పడింది రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస వసతులు లేక తిప్పలు పడుతున్నారు. కార్యాలయానికి శాశ్వత భవనం లేక అద్దె భవనంలో నిర్వహిస్తుండగా.. సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఆ సర్వేశ్వరుని నిలయంగా ఉన్నా వేములవాడ మరియు పరిసర ప్రాంతాల్లో
భూములకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో ఇరుకు గదుల్లో కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. ప్రజలు సరైన కుర్చీలు లేక చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చేవారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు మూడు కుర్చీలు మినహా పెద్ద సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో చంటి పిల్లలను ఎత్తుకొని తమ పనులు కష్టమైనా ముగించుకోవాలిసిన పరిస్థితి దాపురించింది అని ఆవేదన చెందుతున్నారు
అద్దె భవనంలో సరైన తాగునీటి వసతి, మూత్రశాలలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సౌకర్యం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు
పార్కింగ్ లేక వాహనదారులకు తిప్పలు
రిజిస్ట్రేషన్ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడ పెట్టాలో అర్థం కాక రోడ్డుపై నిలుపుతున్నారు. దీంతో ఈ రోడ్డంతా ట్రాఫిక్ తో నిండిపోవడంతో ఇటువైపుగా వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. కార్యాలయానికి వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు సైతం లేకపోవడంతో గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ రుసుము చార్జీలు పెంచిన ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోవడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే నూతన భవనాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది అని వినియోగదారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు