బౌన్సర్లు కాదు గూండాలు.

`ఒళ్లు పెంచుకుంటే చాలు బౌన్సర్లైపోతారా?

`సెలబ్రిటీల పక్కన నిలబడితే బలుపు చూపాలా?

`బౌన్సర్లకు లైసెన్స్‌లు ఎలా ఇస్తారు?

`ఏజెన్సీల ఏర్పాటుకు అనుమతులెలా ఇస్తున్నారు!

`బౌన్సర్ల యూనియన్లు ఎలా ఏర్పడుతున్నాయి?.

`సెలబ్రిటీలకు బౌన్సర్లు ఎందుకు అవసరమౌతున్నారు?

`ప్రతి సందర్భంలోనూ బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

`బౌన్సర్లను పెట్టుకొని సెలబ్రిటీలౌతున్నారా?

`సెలబ్రిటీలు అనిపించుకోవడానికి బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారా?

`బౌన్సర్ల మీద వున్న రౌడీ షీట్లు తెలుసుకుంటున్నారా?

`రౌడీ షీటర్లే బౌన్సర్ల అవతారమెత్తుతున్నారా?

`బౌన్సర్లకు డ్రెస్‌ కోడ్‌ ఎవరు డిజైన్‌ చేశారు.

`వారికి ఆ డ్రైస్‌ కోడ్‌ అనుమతులు ఎవరిచ్చారు?

`అత్యంత వివిఐపిలకు రక్షణగా వుండే ఎస్పీజీ కమాండర్ల కలర్‌ డ్రెస్‌ కోడ్‌ వాడుతుంటే ఏం చేస్తున్నారు.

`భౌన్సర్లు సెలబ్రిటీలకు రక్షణగా ఉంటున్నారా?

`ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంటే కనిపించడం లేదా!

`అల్లు అర్జున్‌ వ్యవహారంలో పోలీసులనే నెట్టేసేంత శక్తి వారికి ఎవరిచ్చారు?

`పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఆఖరుకు చావులకు బౌన్సర్లను వాడుకోవడమేమిటి?

`బౌన్సర్లు లేకుండా బైటకు రాని పరిస్థితులేమిటి?

`సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు బౌన్సర్లు లేకుండా అడుగు బైట పెట్టకపోవడమేమిటి?

`ప్రజా ప్రతినిధులకు కూడా బౌన్సర్ల అవసరమేమొస్తుంది.

`సెటిల్మెంట్లలలో బౌన్సర్లదే కీలక పాత్ర.

`బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆరడుగులుంటే చాలు. కండలు తిరిగిన వస్తాదుల్లా వుంటే చాలు. కండలు తిరిగి దేహ దారుడ్యం వుంటే చాలు. ఇటీవల యువత ఎంచుకుంటున్న ఉపాది మార్గం బౌన్సర్‌. కొన్ని నెలల పాటు జిమ్‌లలో ట్రైనింగ్‌ తీసుకునేవాళ్లు కొందరైతే, సహజంగా దేహ దారుడ్యం వున్న వాళ్లు కొందరు. పైగా వారి డ్రెస్‌ కోడ్‌ చూస్తే ఏదో ఐపిఎస్‌ ఆఫీసర్ల లాగా, దేశానికి ప్రతి క్షణం సేవ చేస్తున్న సైనికుల్లా ట్రైనింగ్‌ అయిన వారిలాగా ఫోజులు కొడుతుంటారు. అసలు బౌన్సర్ల డ్రైస్‌ కోడ్‌ చేస్తూ సెక్యూరిటీలో ప్రైవేటు వ్యక్తులు అన్నట్లు కనించరు. సామాన్యులకు వారు పెద్ద పోలీస్‌ అధికారులేమో? అన్న అన్నంతగా వారి అత్యుత్సాహం చూపిస్తుంటారు. కళ్లకు నల్లటి షెమ్మాలు, ఆధునాథనమైన హియరింగ్‌ మైకులు పెట్టుకొని దర్జా, దర్పం ప్రదర్శిస్తుంటారు. అసలు వారి గురించి తెలియని వాళ్లు వారి వద్దకు చేరుకోవాలంటేనే భయపడుతుంటారు. అలా వారి వ్యవహారం సాగుతుంది. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీలు కార్యాలయాలు, బౌన్సర్లు చేసే రీల్స్‌ చూసి కొంత మంది అలా ట్రైనింగ్‌ అవుతున్నారు. వెరసి బౌన్సర్లలో అమాయకులే కాదు, కరడుగట్టిన నేరస్ధులు కూడా చేరిపోతున్నారు. బౌన్సర్లలో చాలా మందిపై నేరారోపణలున్నాయి. పోలీసు కేసులు నమోదై వున్నాయి. రౌడీషీట్లు ఓపెన్‌ చేసి వున్నాయి. చిన్న చిన్న నేరాలే కాదు, పెద్ద రియల్‌ వ్యాపారంలో నేరాలలో ఇంప్లీడ్‌ అయిన వారు కూడా వున్నారు. ఎక్కడికెళ్లినా సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా కనిపిస్తుండడంతో వారు కూడా హీరోల్లా ఫీలౌతున్నారు. ప్రజలపై ఇష్టం వచ్చినట్లు చేయిచేసుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు లొసుగు వుంది. ఆ బౌన్సర్లుగా అవతారం ఎత్తుతున్న వారిలో చాలా వరకు ఆవేశ పరులుంటారు. కొన్ని కేసుల్లో నిందుతులుగా వున్నవాళ్లు వున్నారు. వివిధ ప్రాంతాలలో రకరకాల గొడవలను ప్రేరేపించిన వాళ్లు వున్నారు. అనేక రకాలుగా నేర పూరిత చర్యల్లో బాగమైన వారు వున్నారు. నగరాలలో రౌడీలుగా చెలామణి అయిన వారు కూడా వున్నారు. వీరందిరకీ కనిపించిన ఉపాది మార్గం బౌన్సర్‌. ఈ మధ్య సెక్యూరిటీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ముసుగులో బౌన్సర్లును తయారు చేస్తున్నారు. వారిని అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజల మీదకు వదిలేస్తున్నారు. వివీఐపిలకు సెక్యూరిటీ ఇచ్చే సమయంలో తమలోని విశృంకలత్వాన్ని బైట పెట్టుకుంటున్నారు. ఒళ్లు చూసుకొని మురుస్తూ, సెలబ్రీల మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపుతుంటారు. అలాంటి సంఘటనలో భాగమే అల్లు అర్జున్‌ వ్యవహరం ముడిపడి వుంది. బౌన్సర్లు అనే వాళ్లు ఆఖరుకు పోలీసులను కూడా కంట్రోల్‌ చేసే దాకా వెళ్లారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాని అప్పుడు అటు పోలీసు యంత్రాంగం కాని, ఇటు సమాజం గాని పెద్దగా పట్టించుకోలేదు. కాని పాపం పండేందుకు కొంత సమయం పడుతుందన్నట్లు బౌన్సర్ల అసలు రూపం ఇప్పుడు బైట పడిరది. సెక్యూరిటీ ఏజెన్సీల డొల్ల తనం ఇక్కడ తేట తెల్లమైంది. సహజంగా ప్రధాన నగరాల్లోనే కాకుండా, చిన్న చిన్న పట్టణాల వరకు సెక్యూరిటీ ఏజెన్సీలు చేరిపోయాయి. ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులు, ఏటిఎంలు, మాల్స్‌, హోటళ్లు, ఇలా చెప్పుకుంటూ రకరకాల వ్యాపారులు తమ కార్యాలయాల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి కూడా డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. చేతిలో చిన్న కర్ర వుంటుంది. కాని బౌన్సర్ల ఎజెన్సీలు అందుకు భిన్నంగా తయారైపోయాయి. దేశంలో అత్యంత వీవీఐపిలుకు రక్షణ కల్పించే రక్షణ వ్యవస్దలోని ఎస్పీజీ కమాండర్‌ తరహాలో డ్రెస్‌ కోడ్‌ ఇచ్చారు. వీవీఐపిలకు రక్షణ కల్పించే ఎస్పీజీ కమాండర్‌లు సూట్‌తో వుంటారు. బౌన్సర్లు సఫారీ సూట్లలలో వుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులకు వుండే పోలీస్‌ సెక్యూరిటీని తలపించేలా వుంటారు. డ్రెస్‌ కోడ్‌ మురురు రంగులో వుండడంతో కొంత ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ ఉపాది కూడా ఒక ప్యాషన్‌ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ కేసులో బలికీ బక్‌రాలు కూడా బౌన్సర్లే అవుతున్నారు. నగర కమీషనర్‌ సివి. ఆనంద్‌ రెండు రోజుల క్రితం కూడా బౌన్సర్ల మీద తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. బౌన్సర్లు అతి చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రజల మీద చేయి వేసినట్లు తెలిస్తే జైలుకు కేసులు నమోదు చేస్తామన్నారు. తమ దాకా వస్తే తప్ప పోలీసులకు ఈ విషయం ఇంత కాలం అర్ధం కాలేదు. గతంలో ఎంతో మంది బౌన్సర్ల మూలంగా గాయాల పాలైన వారు అనేకం వున్నారు. బౌన్సర్లు నేట్టేసిన సందర్భాలలో కాళ్లు, చేతులు విరిగిన వారున్నారు. బౌన్సర్లు చేసే అతి ఇంత కాలం చూస్తూనే వున్నారు. కాకపోతే అల్లు అర్జున్‌ విషయంలో ఏకంగా పోలీస్‌ ఉన్నతాధికారులపై కూడా బౌన్సర్లు తిరగబడడంతో వారి వ్యవహారం పూర్తిగా అర్ధమైంది. అంతే కాదు బౌన్సర్లు లేని తోపులాటలను కూడా సృష్టిస్తారేది తేలిపోయింది. ఎందుకంటే బౌన్సర్లలో కొంత మంది దుందుడుకు స్వభావం కల్గిన వారుంటారు. వారు ఇలాంటివి అక్కడక్కడ ప్రేరేపిస్తుంటారు. నిజానికి అనేక సార్లు అనేక సందర్భాలలో తోపులాటలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయేంత తోపులాటలు జరగవు. ఎందుకంటే ఎవరికి రక్షణ కోసం వాళ్లు చూసుకుంటారు. కాని బౌన్సర్లు ప్రజలను ఇస్టానుసారం వారి పూర్తి బలం ప్రయోగించి జనాన్ని ఒక్కసారిగా తోయడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయని చెప్పడానికి సంధ్య ధియేటర్‌లో దుర్గటనే సాక్ష్యమని చెప్పాలి. బౌన్సర్లు విపరీత ప్రదర్శన మూలంగానే మహిళ చనిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. బౌన్సర్ల అత్యుత్సాహం వల్లనే పెద్ద తోపులాట జరిగింది. పోలీసులను సైతం బౌన్సర్లు తోసేశారు. అంటే వారికి పోలీసులంటే కూడా భయం లేకుండాపోయింది. తాము ఏదైనా కేసులో ఇరుక్కునే పరిస్ధితి వస్తే వీవిఐపిలే రక్షిస్తారన్న అతి నమ్మకం కూడా వారిని కొంత ప్రేరేపించేలా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక బౌన్సర్ల కల్చర్‌ దేశంలో అంతటా మొదలైంది. ముఖ్యంగా సినీ వర్గాలు వారిని విపరీతంగా వినియోగించుకుంటోంది. సహజంగా ప్రజల్లో సినీ వర్గాలకే క్రేజ్‌ వుంటుంది. దాంతో ప్రజలు సహజంగా హీరోలతో ఫోటోలు దిగాలని చూస్తారు. ముఖ్యంగా సెల్‌ ఫోన్లు వచ్చిన తర్వాత అభిమానుల్లో కూడా కొంత అత్యుత్సాహం కనిపిస్తోంది. దాన్ని తప్పించుకునేందుకు హీరోలకు బౌన్సర్ల సాయం అవసరపడుతోంది. అభిమానులు వేలకు వేలు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూడాలి. కాని అదే అభిమానులు దగ్గరకొస్తే మాత్రం తోసేయ్యాలనే మనస్తత్వం సినీ నటుల్లో బాగా పెరిగిపోయింది. ఆ అహం వెర్రి జనానికి అర్ధం కాక సినిమాలో వున్నట్లే బైట కూడా హీరోలు వుంటారని భ్రమ పడుతుంటారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిలా వుంటే ఇటీవల బౌన్సర్లను ప్రతి కార్యక్రమానికి వినియోగిస్తున్నారు. పెళ్లి, పేరంటం, చిన్న చిన్న ఫంక్షన్లు, చాలు, దినాలు ఇలా ఏ కార్యక్రమమైనా సరే సమాజంలో ఒకింత పేరున్న వాళ్లు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేస్తున్న వారు కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫంక్షన్‌ హాల్‌ వద్దకు వచ్చిన విఐపి వచ్చినప్పుడు వారు రక్షణగా రావడం వారిని కుర్చీలలో కూర్చోబెట్టడం చేస్తున్నారు. తిరిగి పెళ్లికి, పేరంటానికి, ఆఖరుకు చావులకు కూడా హజరయ్యే విఐపిలకు కూడా రక్షణ కల్పించేలా ఆర్భాటం చేస్తున్నారు. దాంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఐపిలు వచ్చినప్పుడు బౌన్సర్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. వెళ్లిపోయే మందు విఐపిలు ఇచ్చే దాని కోసం ఆశపడి, అత్యుత్సాహన్ని ప్రదర్శిస్తుంటారు. దాంతో పెళ్లి,పేరంటాలకు వచ్చిన బందువులు కూడా బౌన్సర్ల మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే బంధువులెవరో, స్నేహితులెవరో బౌన్సర్లకు తెలియదు. కాని విఐపిలు ఎవరో అందరికీ తెలుసు. వాళ్లు వచ్చినప్పుడు వారి అనుచర గణం చేసే హంగామాను గుర్తుపట్టి, బౌన్సర్లు కూడా మరింత అతి చేయడం మొదలు పెడతారు. అసలైన బంధువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విఐపిలుగా చెలా మణి కావడం కోసం బౌన్సర్లను రక్షణగా పెట్టుకుంటున్నారా? లేక బౌన్సర్ల మూలంగా మూలంగా విఐపిలుగా చెలామణి అవుతున్నారా? అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా ఇలాంటి బౌన్సర్ల వ్యవస్ధను రద్దు చేయడమే అందరికీ మంచిది. ఎవరి అదుపాజ్ఞల్లో వారు వుంటేనే ఎంతో మంచిది. లేకుంటే బౌన్సర్లు చూసుకుంటారు లే అన్న తేలిక భావంతో వుంటే అల్లు అర్జున్‌ లాగా కేసుల్లో ఇరుక్కునేదాకా వస్తుంది. కటకటాలులెక్కించాల్సి వుంటుంది. తమ ప్రమేయం లేకపోయినా ముద్దాయిలై, నేరస్థుల జాబితాలో చేరాల్సి వుంటుంది. చేయని తప్పుకు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. భవిష్యత్తు ఇలా కూడా నాశనమౌతుంది. తస్మాత్‌ జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!