House Gutted in Short Circuit Fire
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం….
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు దగ్ధమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో రూ. 1.50 లక్షల నగదుతో పాటు విలువైన పట్టుచీరలు అగ్నికి ఆహుతయ్యాయి.ఝరాసంగం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయికిరణ్, జీపీఓ రత్నం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామానికి చెందిన రైతు హుమ్నాబాద్ వినోద సిద్ధన్న దంపతులు గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచుకున్న రూ. 1.50 లక్షల నగదు, పట్టుచీరలు, టీవీ, బీరువా, నిత్యావసర సరుకులు వంట సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 2.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. బాధితులకు జరిగిన నష్టంపై నివేదికను ప్రభుత్వానికి అందజేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయికిరణ్ తెలిపారు.
