నిజాయితీ అధికారులకు నిత్యం నరకమే!

https://epaper.netidhatri.com/

క్షణక్షణం ఎదురయ్యేవి వేధింపులే!

అడుగడుగునా అడ్డంకులే.

ప్రతి ఒక్కడూ బెదిరించుడే.

అవినీతికి పాల్పడేదాకా ఒత్తిళ్లే.

వినకపోతే హెచ్చరికలే..

వింటే కానుకల మీద కానుకలే.

అధికారులు దొరక్కుండా కాపాడేది వాళ్లే..

తెగించే అధికారుల జీవితాలు తెల్లారాల్సిందే.

జనతా గ్యారేజీ సినిమాలో చూపించినట్లు జరిగేదే.

కొందరు మనసు చంపుకొని అవినీతికి పాల్పడుతున్నారు.

ట్రాన్స్‌ఫర్లకు భయపడి చెప్పినట్లు చేస్తున్న వారున్నారు.

నిజాయితీ అధికారులకు భరోసా ఏది?

అవినీతి అధికారులకు శిక్షలేవి?

ఈ రెండిరటికీ మోక్షమేది?

మేడిపండు లాంటి వ్యవస్థలో పురుగులదే రాజ్యం.

పుచ్చిన సమాజంలో అవినీతే అందరూ పంచుకునే ప్రసాదం.

పనిచేసిపెడితే ఫైళ్లు కళ్లకద్దుకుంటారు.

సంతకాలు పెట్టినందుకు మూటలు ముట్టజెబుతుంటారు.

నీతి గురించి మాట్లాడే వారే వెర్రివెంగలప్పలౌతారు.

అవినీతే రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కొన్ని శాఖల్లో నీతిగా వుండడం అన్నది కూడా అధికారులకు కత్తి మీద సామే అంటే అతిశయోక్తికాదు. కాదేదీ కవితకనర్హం అన్నట్లు, ఎక్కడైనా అవినీతికి ఆస్కారమైపోయింది. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం అని పాడుకోవడం సహజమే..కాని కొన్ని శాఖల్లో అవినీతికి పాల్పడలేక, నిజాయితీగా వుండలేక కూడా కొంత మంది అధికారులు మధనపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవస్ధ అన్న తర్వాత అందరూ వుంటారు. మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు వున్నట్లే నీతి,అవినీతి అధికారులు కూడా వుంటారు. అవినీతి పుచ్చిపుండైనట్లు వున్న ఈ సమాజంలో అవినీతి చేయకుండా,నీతివంతంగా వుండాలనుకుంటే కూడా ఊరుకోని సమాజం. అవినీతి చేస్తే దుమ్మెత్తిపోసే సమాజంలోనే, నీతిగా బతకాలనుకునే అధికారులకు కూడా వేధింపులు వుంటాయన్న సత్యం చాల మందికి తెలియదు. మనకు తెలిసిన అవినీతి అంటే ఆసుపత్రుల్లో మంచానికి లంచం. సూదికి లంచం, ఆపరేషన్‌కు అంచం అనుకున్నంత వరకే నిన్నటి దాకా తెలుసు. ఇప్పుడు కొంత కొంత పెరుగుతూ వేలు,లక్షల దాకా వచ్చింది. భూముల ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్లలో ఇక చేతులు మారే లెక్కలు తక్కువేం కాదు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్లుగా వున్న భూముల వ్యవహరంలో సంతకాలకు కూడా పెద్దమొత్తంలోనే ముట్ట జెప్పాల్సివస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లిస్తే సరిపోదు. అంతకు మించి కూడా చెల్లించినా పనులు కాకుండాపోతున్న సందర్భాలు కూడ వున్నాయి. అయితే ఇలాంటి వ్యవస్ధలో నేనే నీతిగా పనిచేస్తాను..నిజాయితీగా వుంటానంటే కూడ వుండనివ్వరు. అలా శరీరమంతా కాన్సర్‌ సోకినట్లు వ్యవస్ధకు అవినీతి చీడ పెరిగిపోయింది. వ్యవస్ధను సర్వనాశనం చేస్తోంది. అందులో ఇటు ప్రజలున్నారు. అటు అధికారులు కూడా కొందరు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక అధికారులకు వుండే వేధింపులు కూడా ఎవరికీ చెప్పుకోలేని విధంగా వుంటాయి. సంతకం పెట్టను, లంచం తీసుకోను. మీరు అడినట్లు రిపోర్టు ఇవ్వను. ప్రభుత్వ ఆదేశాలు దిక్కరించను. అంటూ నిబద్దతకు నేను మారు పేరు అని ఏ అదికారైనా అన్నాడంటే వెంటనే సామధాన బేద దండోపాయాలు వరసుగా మొదలౌతాయి. అధికారి కార్యాలయంలో ఎలాగూ మాట్లాడే అవకాశం వుండదు. అందువల్ల ఇంటికి వరకు వెళ్లొచ్చు. అక్కడ నచ్చ చెప్పొచ్చు. లేకుంటే కుటుంబ సభ్యులను మెప్పించొచ్చు. వారి చేతి ఒత్తిడి చేయించొచ్చు. మాకు అనుకూలంగా రిపోర్టు ఇస్తే ఏం కావలన్నా ఇస్తాం. ఎంత కావాలన్నా ఇస్తాం. మాకు అనుకూలంగా లేకుంటే ఇక్కడ డ్యూటీ చేయనీయం. అసలు బతకనీయం అంటూ ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల ముందు కూడ బెదిరించే వాళ్లుంటారు. దాంతో సైలెంటుగా సంతకాలు చేసి, అవినీతికి అలవాటు పడిపోతుంటారు. ఇక మరికొందరు ఇంటికెళ్తే, ఇక్కడ కాదు, బైట మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకునే వాళ్లు వుంటారు. కుటుంబాన్ని హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలలో పెట్టేవాళ్లుంటారు. అడుగడగునా ఎదురయ్యే అడ్డంకులు తట్టుకుంటూ వెళ్లాలనే చూస్తారు. కాకపోతే ఎక్కడి నుంచి ఏ ఉపద్రవం వస్తుందో అని బిక్కుబిక్కు మంటూ బతుకుతుంటారు. ఇంటి నుంచి భయలుదేరని అదికారి కార్యాలయం చేరుతారా? అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారా? అన్నది కూడా అనుమానమే..అలాంటి జీవితంలో ప్రతి వాడు బెదిస్తూనే వుంటాడు. అయితే ఇది చిన్న చిన్న వి షయాలలో జరగవు. ముఖ్యంగా రియలెస్టేట్‌ వ్యాపారంలో, భూముల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. ఇక మైనింగ్‌ వ్యాపారంలో దీని విశృంకలంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత..అని చెప్పకతప్పదు.
గతంలో ఇసుకు మాఫియూ విషయంలో అనేక సంఘటనలు చూసిందే. మహిళా ఎమ్మార్వోను కొట్టిన వాళ్లున్నారు. అధికారులను లారీలతో గుద్దేసిన వాళ్లున్నారు. గ్రానైట్‌ వ్యాపారంలో ఇవి మరీ పెద్దఎత్తున జరుగుతుంటాయన్నది అందరకీ తెసిందే. మైనింగ్‌ వ్యాపారాలు సాగే జిల్లాలో అవినీతికి పాల్పడే అధికారికి నిత్యం పండగే..కాని నేను పైసా పుచ్చుకోను అనే అధికారికి నిత్యం నరకమే..అందువల్ల తాను ఎంత సిన్సియర్‌గా వుందామనుకున్నా వ్యవస్ధ వారిని నీతిగా వుండనివ్వడం లేదు. ప్రజలు కూడా చిన్న విషయాలపై అతిగా స్పందిస్తుంటారు. కాని సమాజం మొత్తానికి ఇబ్బందులు ఎదురయ్యే విషయాలలో మాత్రం సైలెంటుగా వుంటారు. వ్యవస్ధను కాంక్రీట్‌ కల్చర్‌ను చేసేసి, పర్యావరణం దెబ్బతీస్తూ, అభివృద్ది అని గొప్పలు చెప్పుకునేందుకు వేసే రోడ్లకు అవసరమైన క్రషర్లకు ప్రభుత్వాలు రోడ్ల పక్కనే పర్మిషన్లు ఇస్తుంటారు. నిజానికి అవి జనసమర్ధానికి ఎంతో దూరంగా వుండేలా చూడాలి. కాని అధికారులపై ఒత్తిడి తెచ్చి, నాయకులతో చేతులు కలిపి రోడ్లపై జనం వెళ్లలేని పరిస్ధితులు, పంటలు పండలేని పరిస్ధితులు కూడా ఎదురౌతుంటాయి. అక్కడ స్పందించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రారు. రాజకీయ పార్టీలు, నాయకులు తమ వాటా తాము పుచ్చుకుంటారు. వారికి మూట చేరకపోతే జనాన్ని రెచ్చగొడతారు. వారిది వారికి ముట్టిన తర్వాత జనాన్ని మభ్యపెడతారు. వారి జోలికి వెళ్లడమెందుకని నీతులు చెబుతారు. ఇలా వ్యవస్ధను అందరూ కలిసి నాశనం చేస్తున్నారు.
ఇక హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వెలసిన ఆకాశహ్రమ్యాలను చూస్తే అసలు ఆ వ్యాపారం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. హెచ్‌ఎండిఏ పరిధిని చూసే రెరా అధికారి బాలకృష్ణ ఆస్తుల సంగతి తెలంగాణ మొత్తం చూసింది. అధికారులు కూడా వ్యాపారులను మించి ఆస్ధులు కూడబెట్టుకుంటున్నారంటే ఈ వ్యవస్ధ ఎటుపోతోంది. వండుకున్న వాడికి ఒకటే కూర, అడుక్కున్న వాడికి ఆరు కూరలన్నట్లు వ్యాపారం చేసేవాళ్లను కూడా అధికారులు మించిపోతున్నారు. అధికారి ముదిరితే నాయకుడౌతున్నాడు. మైనింగ్‌ వ్యాపారం సాగించే ఏరియాలలో కొంత మంది ఉద్యోగులు సైతం ఆ వ్యాపారం సాగిస్తున్నారంటే ఎలా సంపాదిస్తున్నారో ఆలోచించొచ్చు. మరి అలాంటి ప్రాంతాలలో నీతిగా పనిచేయాలనుకునే అధికారిని బతకనిస్తారా? బతకనివ్వరు. అందుకే ముందు నీతిగా వున్న అధికారులు కూడా తప్పని సరిపరిస్ధితుల్లో కరెప్టు అవుతున్నారు. అవినీతి సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్‌లో కోటీశ్వరులు తప్ప సామాన్యులు వంద గజాలు కొనుక్కొలేరు. సామాన్యుడు తాను నిలబడేంత స్ధలం కూడా కొనుక్కొలేడు. కాని ఎక్కడో మారు మూల మండలాల్లో పనిచేసే అధికారులకు హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఇండ్లుంటాయి. విల్లాలుంటాయి. లెక్కలేనంత కరెన్సీ వుంటుంది. కిలోల కొద్ది బంగారం వుంటుంది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి. నాయకుల చల్లని చూపు, వ్యాపారులు ఆదరణ తోడైతే అదికారుల పరిస్ధితులు రోజూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంటాయి. గతంలో ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో అవినీతిని అంతం చేస్తామంటూ చెప్పేవారు. కాని ఇటీవల కాలంలో ఆ మాట ఏ ఎన్నికలప్పుడూ వినిపించడం లేదు. అంతెందుకు అవినీతి అధికారులకు రక్షణ కూడా పెంచుతున్నారు. వారికి వారు ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. కేవలం జీతం మీద ఆధారపడితే వారి జీవితాలు అలా వుంటాయా? సమాజంలో నీతి వంతమైన పనులు చేయాలని ఎవరూ అనుకోవడం లేదు. ఎవరు ఎ వరి ని ముంచాలన్న ఆలోచనతో పూట గడుతున్నారు. ఎవరినెత్తిన చేయి పెట్టాలనుకునేవారు ఎక్కువయ్యారు. అందుకు అధికారులను వారధిగా వాడుకుంటున్నారు. జీతం డబ్బులు చూసిన కళ్లకు ఏక కాలంలో ఏడాది జీతం చేతుల్లో పెడుతున్నారు. అవినీతికి బానిసలను చేస్తున్నారు. అయితే నీతి కోసం బతికిన వాళ్లు చాలా మంది వున్నారు. ఇప్పుడు కూడా వుండాలనుకునే వారు వున్నారు. భవిష్యత్తులో అలాంటి మాటకు మాత్రం తావుండదు. అదంతే ఇప్పటికే నీతి గురించి మాట్లాడేవారిని వెర్రివెంగలప్పలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!