Hindu Temple Collapse in South Africa Kills Four
దక్షిణాఫ్రికాలో కూలిన హిందూ దేవాలయం.. భారత సంతతి వ్యక్తి మృతి
దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలిన ఘటనలో నలుగురు కన్నుమూశారు. మృతుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. క్వాజూలు-నటాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల మేర ఉన్న దేవాలయంలో విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు, దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉన్నట్టు సహాయక బృందాలు తెలిపాయి (South Africa Temple Collapse).
శనివారం మరొక మృత దేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ దుర్ఘటనలో టెంపుల్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విక్కీ జయరాజ్ పాండే మరణించినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండేళ్ల క్రితం దేవాలయం ఏర్పాటు అయిన నాటి నుంచీ పాండే అభివృద్ధి కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు. ఇక శనివారం కూడా సహాయక సిబ్బంది శిథిలాల నుంచి ఒక మృత దేహాన్ని వెలికి తీశారు. ఆ తరువాత, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, శిథిలాల కింద ఇంకా ఎందరు చిక్కుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఇక స్థానిక మంత్రి ఒకరు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దిశగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
