
Heavy Rains Lash Chennai
నగరంలో భారీ వర్షం.. పొంచి ఉన్న వాయు గండం
నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది
చెన్నై: నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది. ఎగ్మూరు, పురుషవాక్కం, ప్యారీస్ కార్నర్, కోయంబేడు, అన్నానగర్, ముగపేర్(Annanagar, Mugapere), అయనవరం, విల్లివాక్కం, అశోక్‌నగర్, మైలాపూరు, చోళవరం, తాంబరం, వండలూరు తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. శనివారం వేకువజాము కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కూలిన 17 చెట్లు…
నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు 17 చోట్ల చెట్లు కూలిపడ్డాయి. కార్పొరేషన్ కార్మికులు, ఆయా ప్రాంతాల్లోని అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన కూలిన చెట్లను తొలగించారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దాని ప్రభావంతో నగరంలో, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.