ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాల అందజేత
టి. ప్రైడ్ ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17 వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది.
మహాలక్ష్మి పథకం అమలు
హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 87 కోట్ల 12 లక్షల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. తద్వారా మహిళలకు 2 వేల 958 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం.
ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకూ 1 కోటి 30 లక్షల 67 వేల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.51 కోట్ల 80 లక్షల లబ్ధి చేకూరింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు
రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1 వేయి 835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. దీని ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 10 వేల 622 మంది లబ్ది పొందారు.
రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం, ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల 90 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటిదాకా 95 వేల 146 మందికి లబ్ధి చేకూరుతోంది. దీనికి గాను ప్రభుత్వం రూ. 5 కోట్ల సబ్సిడీ అందజేసింది.
గృహ జ్యోతితో పేదల ఇంట వెలుగులు
అల్పాదాయ వర్గాలవారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లను పారదోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 48 లక్షల 62 వేల 682 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల 41 వేల 520 జీరో బిల్లులు జారీచేయడం జరిగింది. ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు 20 కోట్ల 74 లక్షల 46 వేల 569 రూపాయలను గృహజ్యోతి క్రింద చెల్లించడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్ళు
పేద, బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3 వేల 500 ఇళ్ళ చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం.
రైతన్నలకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ
మా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు లక్షల రూపాయల వరకూ రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఈ రెండు లక్షల రూపాయల లోపు రుణ మాఫీ కి గాను రాష్ట్రంలో 22 లక్షల 22 వేల 67 మంది రైతుల లోన్ అకౌంట్లలో 17 వేల 869 కోట్ల 21 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. జిల్లాలో 43 వేల 892 మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ కింద రూ. 346 కోట్ల 85 లక్షలు జమ చేయడం జరిగింది.
రైతు భరోసా
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతోంది.
సన్న వడ్లకి రూ.500 బోనస్
మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టు బాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల బీమా పథకం
రైతులకు పంటల బీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతే కాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం “తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్” ను ఏర్పాటు చేసింది.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి “తెలంగాణ విద్యా కమిషన్” ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాల అందజేత
మహమ్మద్ మైమిన్, నజీం సుల్తానా, గుమ్మడి అభయ్ పటేల్ కు కారుణ్య నియామక పత్రాలను ప్రభుత్వ విప్ అందజేశారు.
లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
పరిశ్రమల శాఖ నుంచి టీ ప్రైడ్ కింద ఎస్టీలు 17 మందికి, ఎస్సీ లు 36 మందికి, , ఇద్దరు దివ్యాంగులకు మంజూరు పత్రాలు ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసిల్దార్
మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.