చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి వేములవాడ మండలంలోని తిప్పాపూర్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు బోయినపల్లి తిరుపతి సార్ ని మరియు గణిత శాస్త్ర బోధకుడు వేణుగోపాల్ వేములవాడ మండలం చీర్లవంచ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా వారిరువురిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పూలమాలలు , శాలువాలతో ఘనంగా సన్మానించారు.వక్తలు వారి సేవలను కొనియాడుతూ వారితో ఉన్న అనుబంధాన్ని స్మరిస్తూ ఒక్కింత ఉద్వేగానికి గురయ్యారు.విద్యార్థులు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఉపాధ్యాయులకు బదిలీ అనివార్యమే అని, ఉపాధ్యాయ జీవితంలో బదిలీలు అనేది సర్వసాధారణమని వారు ఎక్కడ పని చేసిన వారి సేవలు, జ్ఞాపకాలు మాత్రమే మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయని,పనిచేసిన పాఠశాలలో విద్యార్థులతో తోటి ఉపాధ్యాయులతో మంచి పేరు తెచ్చుకున్న వారు చిరస్థాయిగా నిలిచిపోతారని, కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని విద్యార్థులు జీవితాంతం మర్చిపోరని,పాఠశాల అభ్యున్నతికి, విద్యార్థుల ప్రగతికి విశేష కృషి చేసిన వారి సేవలు మరువరాని వని, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించారని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను వారు అధిరోహించాలని, తమ విద్యాబోధన ద్వారా మరింత మంది విద్యార్థులకు సేవలు అందించాలని ” పేర్కొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థుల గోరుముద్ద కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు బోయినపల్లి తిరుపతి ఐదువేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శంకర్, విద్యా కమిటీ చైర్మన్ పిట్టల బాబు, సింగిల్ విండో చైర్మన్ తిప్పిన శ్రీనివాస్, నాయకులు సిరికొండ శ్రీనివాస్ ,చిర్రం తిరుపతి, గొట్టె ప్రభాకర్, దారం చంద్రం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.