’’గ్రానైట్,మైనింగ్ మాఫియా’’ సాగిస్తున్న ‘‘అరాచకం’’.
కొండలు,గుట్టలు మాయం.. తెలంగాణా ‘‘బోడగుండు’’ ఖాయం!
`మైనింగ్ పేరుతో ఇష్టాను సారం సాగుతున్న తవ్వకం
`కొండలు కరిగిపోతున్నాయి?
`గుట్టలు తరిగిపోతున్నాయి!
`ఇరవై ఏళ్ల కింద కళ కళ లాడిన కొండలెవ్వి?
`ప్రక ృతి ప్రసాదించిన పచ్చటి కొండల ఆనవాలేది?
`ఇట్లా తవ్వుకుంటూ పొతే భవిష్యత్తు అంధకారం.
`అభివ ృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం!
`ప్రక ృతి మీద పగపట్టిన వ్యాపారుల అవినీతి సామ్రాజ్యం.
`ప్రక ృతి సంపద కొల్లగొడుతూ అక్రమ సంపాదన కోసం.
`ఆరవళి పార్వతాలలో మైనింగ్ ప్రజా హితానికి హేతువు!
`తెలంగాణా లో విధ్వంసం ప్రగతికెలా సంకేతం!
`గుట్టలు ‘‘గ్రానైట్ బండల’’ కోసం ఖాళీ చేస్తున్నారు?
`గ్రానైట్ వ్యాపారం పేరుతో కొండలను మింగేస్తున్నారు.
`కొండ ప్రాంతాలను బొందల గడ్డలుగా మార్చేస్తున్నారు.
`కొండలు కంకర కోసం కరగ తీస్తున్నారు!
`గతంలో అక్కడ కొండలుండే అని చెప్పుకోవడానికి వీలు లేకుండా
చేస్తున్నారు!
`కొండల ఆనవాలు పూర్తిగా తుడిచేస్తున్నారు!
`మట్టిని కూడా వదలకుండా అమ్ముకుంటున్నారు!
`ఊర్లన్నీ దుమ్ము దూళి తో నింపేస్తున్నారు!
`తెలంగాణాలో పర్యావరణ సమతుల్యతను సర్వ నాశనం
చేస్తున్నారు!
`ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు?
తెలంగాణా లో జరుగుతున్న ‘‘అక్రమ మైనింగ్ మాఫియా’’ పై
‘‘నేటిధాత్రి’’ లో వరుస కథనాలు?
పర్యావరణ పరిరక్షణ కోసం ‘‘నేటిధాత్రి’’ మొదలు పెడుతున్న అక్షర
పోరాటం.
హైదరాబాద్, నేటిధాత్రి:
పరిశ్రమల పేరుతో ప్రగతి దారుల ముసుగులో అభివృద్ది కంకణం మాటున ప్రకృతిని పగబట్టినట్లే చెర బడుతున్నారు. కొండలు, గుట్టలు మింగుతున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. పర్యావరణ సమసత్యులను దెబ్బతీస్తున్నారు. నేటి కాలం చూసుకుంటున్నారు. భవిష్యత్తు కాలాన్ని ఫణంగా పెడుతున్నారు. జీవరాశుల పాలిట యములౌతున్నారు. జీవకోటి మనుగడను ప్రశ్నార్ధం చేస్తున్నారు. ఆఖరుకు మనుషులను బొందల గడ్డలో తోసే దారులు వెతుకుతున్నారు. రేపు రేపు ఊపిరాడని రోజులు తేనున్నారు. కాలుష్యం పెంచి, జీవకోటిని అంతం చేస్తున్నారు. ఇప్పటికే ఇరవై ఏళ్ల క్రితం వున్న ప్రకృతి సంపద ఎంతో తరిగిపోయింది. దుర్మార్గుల మూలంగా కరిపోయింది. కంటికి కనిపించకుండా మాయమైపోయింది. అయినా వారి ధన దాహం తీరడం లేదు. సంపద కొల్లగొట్టడం ఎప్పుడూ అభివృద్ది కాదు. సంపద సృష్టించలేనప్పుడు దానిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదు. కొన్ని లక్షల సంవత్సరాలుగా జరగని విధ్వంసం ఇప్పుడే ఎందుకు జరుగుతోంది. కొన్ని వేల సంవత్సరాల మనవ ఆనవాలుఇంకా లభిస్తున్నా, నేటి మనిషి జాడ వచ్చే తరం గుర్తించే అవకాశం లేకుండాపోతోంది. తినే తిండి కల్తీ. తాగే నీరు కల్తీ. పీల్చే గాలి కల్తీ చేస్తున్నారు. మానవ మనుగడను సర్వనాశనం చేస్తున్నారు. పల్లెలు పోయి, పట్టణాలు వెలుస్తున్నాయి. మహాత్మా గాందీ ఇప్పుడు బతికి వుంటే తాను మాట్లాడిన పల్లెలో పట్టు గొమ్మలు అనే మాట అనేందుకు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంతలా పల్లె నుంచి మొదలు అడవి దాకా, అక్కడి నుంచి పట్నం దాక ప్రకృతి అంతా విద్వంసమే. మైనింగ్ అనే మహమ్మారి విస్తరించిపోయింది. ప్రజలను బూతంలా పట్టుకొని పీడిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ తవ్వకాల మూలంగా జీవ వైవిద్యం అంతమైపోతోంది. మరో రకంగా మైనింగ్ మూలంగా పల్లెలన్నీ దుమ్ము దూళితో నిండిపోతున్నాయి. పచ్చని పొలాల మీద పైర పైట పర్చుకోవాల్సిన చోట దుమ్మ పేరుకుపోతోంది. పచ్చని పొలం కాస్త దుమ్ముతో నిండిపోతోంది. ఎదగాల్సిన పంట ఎండిపోతోంది. చేతికి రావాల్సిన పంట చెల్లా చెదరైపోతోంది. పొలాల నిండా రాతి ఇసుక కూరుకుపోతోంది. పొలం కాస్త రాతి పొడితో నిండిపోయి పంటలకు అక్కరకు రాకుండాపోతోంది. కాని ఇది ఎవరికీ పట్టదు. పాలకులకు తెలియదు. అదికారులు చర్యలు తీసుకోరు. రైతు గోడు ఎవరూ వినరు. ప్రశ్నించలేక, ఎదిరించలేక రైతు కళ్లు, నోరు మూసుకొని బతుకుతున్నారు. అలా ప్రకృతిని ద్వంసం చేస్తూ, ఇలా రైతును నాశనం చేస్తూ, ప్రజలను ఊపిరాడకుండా చేస్తున్నారు. ఓ వైపు నగరాల నుంచి సేకరించే చెత్త తగలబెట్టడంతో వచ్చే పొగ, మైనింగ్ పేరుతో కొండలను తవ్వుతుంటే వచ్చే రాతి దుమ్మతో ప్రకృతి అంతా దూళి మయమైపోతోంది. ముక్కులకు మాస్కులుపెట్టుకుంటూ బైటకొస్తున్నారు. వీటితోపాటు మైనింగ్ జరుగుతున్న గుట్టలకు సమీపంలో వున్న గ్రామాల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్తున్న రాతి దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటోంది. ఇళ్లంతా నిండిపోతోంది. మైనింగ్ కోసం పేల్చే బాంబులతో బిల్డింగులు అదురుతున్నాయి. ఇండ్లు పర్రెలు పడుతున్నాయి. పాత ఇండ్లు బాంబుల మోత చప్పుడుకు కూలిపోతున్నాయి. భూమి వణుకుతోంది. భూకంపం వచ్చినట్లు కదుతోంది. ఇండ్లన్నీ బీటలు వారి కొత్త ఇండ్లు కూడా పాత పడిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పశువుల మేస్తున్న దానపై మైనింగ్ కొండల నుంచి వస్తున్న దుమ్ముదూళితో నిండిన మేతను మేస్తున్నాయి. పశువులు అనార్యోగం పాలౌతున్నాయి. పశువుల ప్రాణాలుపోతున్నాయి. ఎవరికి మేలుచేస్తున్నాయి మైనింగ్ పనులు? దేశానికి ఆదాయమేమో కాని, జనాల ప్రాణాలు పోతున్నాయి. ఇలా ప్రకృతిని విద్వంసం చేసి ఆదాయం సమకూర్చుకోవడం ఎందుకు? ప్రజల ఆరోగ్యాలను పాడు చేసి, మళ్లీ వారికి వైద్యం పేరుతో ఖర్చు చేయడం ఎందుకు? ఇదంతా పిర్ర గిల్లి జోలపాడినట్లు పైకి కనిపిస్తున్నా భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలు బతికే పరిస్దితి లేకుండా పోతుంది. ఇప్పటికే సగానికి పైగాకొండలు మాయమైపోయాయి. ఇరవై ఏళ్ల క్రితం కనిపించిన పచ్చని ప్రకృతితో అలరాడిలా కొండలు, గుట్టలు ఎన్నో మాయమైపోయాయి. ఇక్కడ గుట్టలుండేవి. అక్కడ కొండలుండేవి? అని చెప్పుకోవాల్సి వచ్చే రోజులున్నాయి. గుట్టలు, కొండలు మొత్తం మింగేసి, మిగిలిన బండల కోసం బావులు తవ్వినట్లు గుట్టలంత పెద్ద పెద్ద బొందల గడ్డలుచేస్తున్నారు. మైనింగ్ పేరుతో కొండలు గుట్టలు మాయం చేసి, తెలంగాణను బోడిగుండును చేస్తున్నారు. వచ్చే యాభై ఏళ్లతో తెలంగాణలో కొండ అంటే ఇలా వుంటుంది. గుట్ట అంటే ఇలా వుంటుందని చెప్పుకోవడానికి ఒకటి రెండు మిగుల్చుతారేమో? అని పిస్తోంది. ఇరవై ఏళ్లలో కొన్ని వేల కొండలు గుట్టలుమింగిన వాళ్లు మరో యాభై ఏళ్లలో వాటి ఆనవాలు కూడా లేకండా చేయరని అనుకోలేం. పర్యావరణ శాఖలు కూడా చూసి చూడనట్లు అనుమతులు ఇస్తుంటే, పాలకులు చూస్తూ ఊరుకుంటుంటే, అదికారులు దగ్గరుండి సహకరిస్తుంటే కొండలను మింగుతున్న అనకొండలు కొత్తగా కూడా ఎంతో మంది పుట్టుకొస్తారు. ఒక్క గుటుక్కున గుట్టలను మింగేస్తారు. రాత్రికిరాత్రి గుట్టలను మాయం చేసి, కొత్త కొండలను ఎంచుకుంటారు. ఓ వైపు ఆరావళి కొండలను మైనింగ్ కోసం వినియోగిస్తే ప్రకృతి పాడౌతుంది? పర్యావరణ అమసతుల్యత పెరిగిపోతోంది. ఎండలు పెరిగిపోతాయి. వానలు తగ్గిపోతాయి. కరువు కాటకాలు వస్తాయి. దేశం ఎడారి అవుతుంది. వాతారణ కాలుష్యం పెరిగిపోతుంది. మంచినీటి జాడలు మామయమౌతాయి అని చెబుతున్నారు. ఉద్యమాలు సాగిస్తున్నారు. మరి తెలంగాణలో వున్న కొండలు, గుట్టలు పర్వతాలు మాయమైతే తెలంగాణకు అదే పరిస్దితి రాదా? తెలంగాణలోని పర్యావరణ వేత్తలకు ఇక్కడ అంతార్ధనమైపోతున్న కొండలు కనిపించడం లేదు. ఆనవాలు లేకుండాపోతున్న గుట్టలను పరిరక్షించాల్సిన భాధ్యత లేదు. పాలకులు ఎవరైనా వారిలో కూడా నాయకులుగా ప్రజా ప్రతినిధులు కూడా మైనింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. అదికారం చేతిలో వుంది కాదా! అని పర్మిషన్లకు మించి మైనింగ్‌లు చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి కొండలు మింగి, బొర్రలు పెంచుకుంటున్నారు. అంతే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలను ఎగ్గొడుతున్నారు. నాయకులను ప్రసన్న ంచేసుకొని, అదికారుల అండదండలు చూసుకొని ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ప్రకృతి వినాశనానికి దారులు వేస్తున్నారు. కొండలతోపాటు చెట్టు, చేమ, పుట్టలు లేకుండా చేసి, స్వచ్చమైన గాలిని జనానికి అందకుండా చేయడంతోపాటు, దుమ్ము, దూళిని బహుమతులుగా ఇస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడకుంటున్నారు. ఇలా తెలంగాణలో విద్వంసమైన కొండలెన్ని? జిల్లాల వారిగా లెక్కలతో సహా, తెలంగాణ ప్రకృతి విధ్వంసం మీద నేటి ధాత్రి అక్షర పోరాటం మొదలు పెట్టింది. ఇక వరుస కథనాలతో ప్రజలకు నిజాలు చెప్పనుంది. ప్రకృతి ప్రేమికులు ఎంత మంది స్పందిస్తారో చూడాలి. పర్యావరణ వేత్తలు ఎంత మంది కదులుతారో చూడాలి. తెలంగాణ పర్యావరణ సంరక్షణ కోసం ఎంత మంది ముందగుడు వేస్తారో చూడాలి…!!!
