
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జయ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు వారిచే గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే, జిల్లా అదనపు కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు తో కలిసి టి.ఎస్.ఎస్ కళాకారులు, వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
తదుపరి నలుగురు స్వాతంత్ర సమరయోధులు మేరుగు భావనా ఋషి, దిందిగాల చంద్ర లింగం, వెంగల రుక్కమ్మ, బర్ర రాజవీరులను శాలువాతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు.
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలను, మెడల్స్ ను అందజేశారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో
మహిళా స్వశక్తి సంఘాల మహిళలకు 130 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు, కులాంతర వివాహాలు చేసుకున్న నాలుగు జంటలకు ప్రభుత్వం నుండి రెండు లక్షల రూపాయల ఆర్థికంగా సహాయం చెక్కులను అందించారు.
స్టేడియం ఆవరణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్య ఆరోగ్యశాఖ వారు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ప్రారంభించి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్డీవో రమాదేవి,తో జిల్లా అధికారులు,కాటారం భూపాలపల్లి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.