తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు
నర్సంపేట,నేటిధాత్రి :
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూక్య సమ్మయ్య పిలుపునిచ్చారు.గురువారం చెన్నరావుపేట రైతు వేదికలో అబ్బదాసి అశోక్ అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక మండల సదస్సులో వారు మాట్లాడారు.ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాల మూలంగా దేశం దివాలా తీసిందన్నారు. ప్రజల సంపద అంబానీ,అధాని వంటి కార్పొరేట్ శక్తులకు అక్రమంగా అప్పనంగా కట్టబెట్టిందన్నారు.ఆక్సుపామ్ నివేదిక ప్రకారం 2018 నుండి 2022 వరకు దేశంలో పేదల సంఖ్య 19కోట్ల నుండి 35కోట్లకు పెరిగిందని అన్నారు.పేదల ఆకలి పెరిగి మరణించిన బాలలో 65 శాతం మంది పౌష్టికాహార లోపంతో మరణించారని ఆరోపించారు.
రైతువ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను బలవంతంగా భూముల నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిందని, రైతాంగ ఉద్యమాలకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికి అవేవిధానాలను దొడ్డిదారిన అమలు చేస్తున్నదని విమర్శించారు.
దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక మతోన్మాద విధానాలనుప్రజలకు వివరించేందుకు ఇంటింటికి కరపత్రాన్ని పంపింని చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. రైతాంగానికి, కార్మిక వర్గానికి, వ్యవసాయ కార్మికులకు బిజెపి ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి,రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బిల్లా భూపాల్ రెడ్డి,ఎంజిపిఎస్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.