
Government
ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరించి పాలన కొనసాగించడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.ఎంసిపిఐ(యు) ఖిలా వరంగల్ ఏరియా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్లెల రాజేందర్ అధ్యక్షతన తూర్పుకోటలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను భంగంకలిగించే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ పాలకులకు వంతపాడిన ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను పొగడటం మోడీ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం ఎద్దేవా చేశారు.ట్రంపు విధానాలకు అండగా నిలబడుతూ దేశ ప్రజలపై 50 శాతం సుంకాలు విధించిన కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో రోజురోజుకు ఆకలి నిరుద్యోగం, దారిద్రం ఆత్మహత్యలు పెరుగుతున్న అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం, కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనైనా అమలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రం ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కై 65 లక్షల మంది ఓటర్లను తొలగించి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్ర పన్నిందని ప్రతిపక్షాల పోరాటాలతో సుప్రీంకోర్టు సైతం మొట్టికాయ వేయడం మోడీ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వరంగల్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించి గత ప్రభుత్వ దారిలోనే పయనిస్తుందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రజా ఉద్యమాలే ఏకైక ప్రత్యామ్నాయమని ఆ దిశలో పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఎంసిపిఐ(యు)లో చేరిన రచయిత దర్శకుడు చిర్ర రాజేష్ ఖన్నా
వరంగల్ నగరంలోని 35వ డివిజన్ కు చెందిన రచయిత దర్శకుడు చిర్ర రాజేష్ ఖన్నా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ సమక్షంలో ఎంసిపిఐ(యు) చేరారని పార్టీ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ తెలిపారు. అలాగే ఖిలా వరంగల్ ఏరియా కార్యదర్శిగా చుంచు జగదీశ్వర్ సహాయ కార్యదర్శి రాజేష్ ఖన్నా, ఏరియా కమిటీ సభ్యులుగా నల్లెల రాజేందర్, రాయినేని ఐలయ్య, నలివెల రవి ,ఇట్టినేని మధు, కొమ్ము లావణ్య ఎన్నికైనట్లు తెలిపారు. ఈ ఏరియా పరిధిలోని 34, 35 ,36,37, 38 డివిజన్లోని సమస్యలపై సర్వే నిర్వహించి పోరాటాల నిర్వహించాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు యగ్గేని మల్లికార్జున్, ఐతం నాగేష్,నగర నాయకులు బాబు రామస్వామి, నరహరి, బంగారి రామ స్వామి తదితరులు పాల్గొన్నారు.