హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా? బుల్డోజర్లు ఎప్పుడైనా రావచ్చు?

 

సొంతింటి కల నెరవేరిందనుకుంటున్నారా?

గేటెడ్‌ కమ్యూనిటీలని గ్రేట్‌ గా ఫీల్‌ అవ్వకండి?

ఆకాశంలో కట్టడాలని ఆశపడకండి?

ఫ్రీ లాంచ్‌ ఆఫర్లు అనగానే మోసపోకండి?

ఫామ్‌ ల్యాండ్స్‌ అనగానే ఆశపడకండి?

మీరు చెల్లించే సొమ్ము మీ చెమట కష్టమన్నది మర్చిపోకండి

పబ్లిసిటీ స్టంట్‌ లను చూసి మీరు స్టంటులు వేయించుకునే దాకా తెచ్చుకోకండి

భూమి పూజ రోజు వచ్చిన సెలబ్రిటీలను చూసి ఆకర్షితులు కాకండి

మీరు కొన్న భూమిలో లొసుగులేమైనా వున్నయో చూసుకున్నారా?

రియల్‌ కంపెనీ మాటలకు పడిపోయారా?

బ్రోచర్లు చూసి ఆకర్షితులయ్యారా?

బ్రోకర్ల మాటలన్నీ నిజమని నమ్మారా?

డిస్కౌంట్‌లకు తలూపి కోట్లు పెట్టారా?

ఆ స్థలాలు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చు.

సొంతిళ్లు కూలిపోవచ్చు.

కల చెదిరిపోవచ్చు…

మళ్ళీ బతుకు రోడ్డు మీదికి రావొచ్చు!

తస్మాత్‌ జాగ్రత్త…రియల్‌ మోసగాళ్లున్నారు.

అక్రమ భూములంటగడతారు! జారుకుంటారు.

అప్పుడు మీరు లబోదిబోమన్నా! ఎవరూ అయ్యో అనరు.

ఆ కంపనీలపై త్వరలో వరుస కథనాలు…మీ ‘‘నేటిధాత్రి’’ లో…

హైదరాబాద్‌లో ఇల్లు వుండాలి. ఇప్పుడు ఎవరికైనా స్టేటస్‌ సింబల్‌. గతంలో ఊరిలో ఎన్ని ఎకరాల భూమి వుందనేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎన్ని ఇండ్లు వున్నాయని అడుగుతున్నారు. ఒక విచిత్రమైన సందర్భమేమిటంటే ఇటీవల పెళ్లి సంబంధాలలో హైదరాబాద్‌లో ఇల్లుందంటేనే అబ్బాయిలకు పిల్లనిస్తామని కూడా అంటున్నారట. అంటే హైదరాబాద్‌ల ఇల్లు వుండడం అందరికీ అవసరమైపోయింది. అదే రియల్‌ వ్యాపారులకు వరమైంది. దాంతో ఎక్కడికక్కడ హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఖాళీ జాగలు లేవు. ఉన్నవాటిని కొనాలంటే కోట్లు వెచ్చించాలి. ఇక్కడే అసలు మతలబు దాగి వుంది. ఎక్కడ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నా, ఎక్కడ గేటెడ్‌ కమ్యూనీటీలు ఏర్పాటు చేస్తున్నా, ఆకాశాన్ని తాకేంత ఎత్తులో అప్పార్టుమెంట్ల నిర్మాణం జరుగుతున్నా వాటిని చూసి మీరు ఆకాశంలో మేడలు కట్టుకోకుండి. ఊలకు రెక్కలు తొడకండి. ఇక్కడ నివాసం లేని జీవితం ఏం జీవితం అని అప్పులు చేసి మరీ తొందరపడకండి. ఎందకంటే ఇకపై హైదరాబాద్‌లో చిన్న స్ధలం కొనాలన్నా, నిర్మాణంలో వున్న ఇండ్లు కొనాలన్నా, అప్పార్టుమెంట్లు ఏదైనా సరే ఒకటకి పదిసార్లు ఆలోచించండి. అవసరమైతే వందసార్లు ఆలోచించండి. అంతే కాని తొందరపడకండి. బిల్లర్లు తెలిసిన వాళ్లే..అనో..లేక బ్రోకర్లు మన వాళ్లే అనో తొందరపడకండి. రియల్‌ వ్యాపారంలో అందరూ నిమిత్త మాత్రులే. వేల కోట్లతో నిర్మాణాలు సాగిస్తున్న సంస్థలేవీ తన జేబుల్లో నుంచి డబ్బులు పెట్టి నిర్మాణాలు చేయడంలేదు. ఎంత పెద్ద బిల్డరైనా సరే బ్యాంకుల నుంచి అప్పులు, కస్టమర్ల నుంచి అడ్వాన్సులు వసూలు చేశాకే పునాదులు మొదలు పెడతారు. ఇవన్నీ గమనించకుండా పెద్ద పెద్ద కార్లలో దిగేవారంతా నిజాయితీ రియల్టర్లు కాదు. ఆ కార్లు వారి సొంతమేమీ కాదు.
మనలాంటి సామాన్యులు పైసా పైసా కూడబెట్టి, సొంతింటి కల కోసం దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లు వారి చేతుల్లో పెడతాం. వాళ్లు మన సొమ్మును అనుభవిస్తుంటారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బస చేస్తుంటారు. మన డబ్బులతోనే కస్టమర్లుకు పార్టీలు ఇస్తుంటారు. అందమైన బ్రోచర్లు ముద్రిస్తుంటారు. కోట్ల విలువైన కార్లలో ఊరేగుతుంటారు. ఏదో ఒక రోజు అందర్నీ నిండా ముంచేస్తారు. మరోచోట ప్రత్యక్షమౌతారు. ఇప్పుడు రియల్‌ వ్యాపారంలో ఇదే ట్రెండ్‌.. ఈ సంగతి తెలియక మనలో ఎంతోమంది మోస పోతుంటాం. ప్రతి వ్యక్తిలో వుండే మరో నైజం కూడా రియల్లర్లకు వరమైపోతోంది. మనం మోసపోయామని తెలిసిన మరుక్షణం, ఇంకా ఎంత మంది మోసపోయారో తెలుసుకొని, నేక్కొడినే కాదన్నమాట..అని సంతోషపడుతుంటాం..అయ్యే ఇంత మందిమి మోసపోయామా? అన్న ఆలోచన రాదు. ఇదీ మనలో వుండే బలహీనత. దీన్ని కూడా బిల్డర్లు అనువుగా మల్చుకుంటున్నారు. అందుకే ప్రజల్లో మరింత చైతన్యం పెరగాల్సిన అవసరం వుంది. అందరూ ఉన్నత విద్యావంతులే అయినా మోసపోతున్నారు. గతం కన్నా ఇప్పుడే ఎక్కువ మోసపోతున్నారు. కారణం ఉరుకుల పరుగుల జీవితం. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరో ముక్కూ మొహం తెలియని వారి చేతుల్లో అప్పనంగా పెడుతున్నాం. మన నమ్మకాన్ని బిల్డర్లు సొమ్ము చేసుకుంటున్నారు. మనల్ని నిలువునా దోచేస్తున్నారు. బోర్డులు తిప్పి మోసం చేసేస్తున్నారు. అందువల్ల మనం ఏం స్ధలం కొనాలన్నా, ఏ అప్పార్టుమెంటులో ప్లాట్‌ తీసుకోవాలనుకున్నా, పత్రాలన్నీ సరిగ్గా వున్నాయా? లేదా? అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి.

రియల్టర్లు చూపించిన డాక్యుమెంట్లను ఎట్టిపరిస్ధితుల్లోనూ నమ్మొద్దు. పెద్ద పెద్ద కంపనీలే కదా? అని గుడ్డిగా నమ్మొద్దు. ఆ పెద్ద పెద్ద కంపనీలే నిండా ముంచేస్తాయి. అలాంటి కంపనీలు మోసం చేస్తే అడిగే దిక్కు కూడా వుండదు. స్థలాలపై వున్న లిటిగేషన్లు చూసుకోవాలి. పైగా ప్రభుత్వాలు మారినప్పుల్లా సమస్యలు రావొచ్చు. తాజగా మాజీ మంత్రి మాల్లారెడ్డికి చెందిన భవనాలే నేల కూలుతున్నాయి. తన సొంతంగా కొనుగోలు చేసిన భూముల్లో కోట్లాది రూపాయలు పెట్టి కట్టిన భవనాలకే దిక్కులేదు. మనం వంద గజాల స్ధలం కొన్నా, డబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్‌ కొన్నా, గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లా కొన్నా, ఆ స్థలాల పరిశీలన ఎంతో ముఖ్యం. ఆ భూములు ఎవరివి? అవి ఎవరి నుంచి ఎవరి చేతులు మారాయి? ఎంత మంది కొనుగోలు చేశారు. వాటిలో వున్న లోపాలు ఏమిటి? అన్న విషయాలను కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో తెలుసుకోవాలి. అవసరమైతే ఆర్టీఐ నుంచి సమాచారం పొంది, అంతా సవ్యంగానే వున్నాయనిపిస్తేనే కొనుగోలు చేయండి. మేమెక్కలమేనా? అనుకొని గొర్రెలు ఒకదాని వెనక ఒకటి వెళ్లి బావుల్లో దుంకినట్లు వెళ్లకండి. గతంలో అంటే సమాచరం తెలుసుకోవడం పెద్ద పని. కాని ఇప్పుడు ఏ భూమికి సంబంధించిన విషయమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయినా బద్దకస్తులు పెరిపోతున్నారు. రియల్‌ వ్యాపారులు అందుకే మోసం చేస్తున్నారు. అమ్మకం దారులు వందల ఎకరాలు భూముల కొనుగోలు చేసి, కొంత ఆక్రమించుకొని, జనానికి అంటగట్టేస్తుంటారు.
అందమైన కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంటారు. ఆ కార్యాలయాల్లో నిత్యం పదుల సంఖ్యలో జనం వుంటారు. ఎప్పుడు వెళ్లినా అటూ, ఇటూ తిరుగుతూ, అందరూ కొనుగోలు దారుల్లానే కనిపిస్తుంటారు. దాంతో మనం ఆ కంపనీ స్ధలాల కోసం ఇంత మంది వస్తున్నారంటే ఎంతో నమ్మకమైందన్న భ్రమలో పడిపోతాం. నిజానికి అదంతా ఒక అపోహ. అక్కడ నిత్యం వుండేవాళ్లంతా వాళ్ల మనుషులే. మనం పెద్దగా పట్టించుకోం. పది సార్లు ఆ కంపనీ కార్యాలయాలకు వెళ్లినా తెలుసుకోవాలని ప్రయత్నం చేయం. ప్రజల దృష్టి ఇతర సమస్యల మీద మల్లకుండా వుండేందుకు ఆ కార్యాలయాల నిండా అందమైన అప్పార్టుమెంట్ల ఫోటోలు, సెలబ్రిటలతో దిగిన ఫోటోలు వుంటాయి. వాటికి తోడుగా అనేక అవార్డులు వచ్చినట్లు, వాటిని తీసుకుంటున్నట్లు,విశ్వసనీయతకు వాళ్ల కంపనీలే మరు పేరన్నట్లు కలరింగ్‌ ఇ స్తారు. అసలు అవార్డులు ఇచ్చిన ఆ సంస్థలేమిటో? అవి ఎక్కడున్నాయో? కూడా ఎవరికీ తెలియదు. అందమైన మెమెంటోలు చూసి మనం మాయలోపడిపోతాం. పైగా ఇప్పుడు చెల్లిస్తే ఇంత..తర్వాత చెల్లిస్తే అంత…అంటూ కొత్త లెక్కలు చెబుతుంటారు. మన కళ్లముందే ఎవరో వచ్చి డబ్బులు చెల్లిస్తున్నట్లు, ప్లాట్లు బుక్‌ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంటారు. అదంతా ఓ మాయా ప్రపంచాన్ని తలపించేలా చేస్తారు. ఎవరైనా ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారన్న సంగతి తెలిసిన వెంటనే ఆ కంపనీ బాధ్యులు కొంత మందిని పంపిస్తారు. మీరు మా ఆఫీసుకు ఒకసారి వచ్చి అన్నీ తెసుకున్న తర్వాతే కొనండి? అంటూ కొసమెరుపు ఇస్తారు. అసలు మోసమంతా అక్కడే జరుగుతుందని మనం గ్రహించం. ఇంత మర్యాదగా చెబుతున్నారంటే ఆ కంపనీ ఏదో మంచిదై వుంటుందన్న నమ్మకమే మనల్ని మోసం చేస్తుంది. నిండా ముంచేందుకు దారి తీస్తుంది. మనం ప్రతిపైసాను కష్టపడి సంపాదిస్తాం. పైసా పైసా కూడబెట్టుకొని మురిసిపోతాం. సొంత ఇల్లు కలను నిజం చేసుకోవాలన్న తపనతో ఇతరులను నమ్ముతుంటాం.

మనకు ఓపిక తక్కువ. గతంలో ఇల్లు దగ్గరుండి కట్టుకునేవాళ్లు. కాని ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. కనీసం ఎండలో గంట సేపు నిలబడే ఓపిక ఎవరికీ లేదు. ఆ కష్టమంతా మనమేం పడతామనుకుంటాం..కట్టిన ఇండ్ల కోసం ఎబడుతున్నాం. ముందే డబ్బులు చెల్లించి, వాళ్లు ఎప్పుడిస్తారా? అని ఎదరుచూస్తుంటాం. కాని వాళ్లు ఇల్లు కట్టేది లేదు. ఇచ్చేది లేదు. ఒక వేళ మీ అదృష్టం బాగుండి..ఇల్లు వచ్చిందే అనుకుందాం..అప్పార్టుమెంటులో ప్లాట్‌ దక్కిందే అనుకుందాం… ఆ స్ధలం వివాదంలో వుండొచ్చు. దానిపై లేనిపోని లొల్లులు నడుస్తుండొచ్చు. ఆ స్ధలాలపై కేసులు పడొచ్చు. ప్రభుత్వాలు కలుగ జేసుకొని బుల్డోజర్లు రావొచ్చు. కార్పోరేషన్లు చర్యలు తీసుకోవచ్చు. మీ కళ్లముందే మళ్లీ మీ కలలు కూలిపోవచ్చు. బతుకులు మళ్లీ రోడ్డుమీదకు రావొచ్చు. ఇలాంటి నిజాలు ఎవరూ చెప్పరు. ఎందకంటే వ్యాపారంలో నిజాలు చెబితే ఎవరూ నమ్మరు. అబద్దాలు చెప్పేవారినే నమ్ముతారు. జనం పదే పదే మోసపోతూనే వుంటారు. వ్యాపారులు ఎదుగుతూనే వుంటారు. సామాన్యులే సమిధలౌతుంటారు..ఇవి విధివైపరిత్యమని సర్ధుకుపోతాం..మనకు ఇంతే రాసి వుందని మనసుకు సర్ధి చెప్పుకుంటాం…మోసపోయాని చెప్పుకోలేని పిరికివాళ్లం…భయంతో, బలహీనతతో బతికేస్తుంటాం..మన సొమ్ముతో వ్యాపారులు సోకులు చేసుకుంటుంటే చూసి కోపం తెచ్చుకోలేం. వచ్చిన కన్నీళ్లను తచుకుంటాం…అంతే..అంతకు మంచి ఏం చేయలేం!! ఏమంటారు???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!