పట్టుదల ఉన్న యువతకు ప్రభుత్వ ప్రోత్సాహం

సాధించాలనే పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తాం

మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల,నేటి ధాత్రి:

ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల,క్రమశిక్షణ ఉన్న యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ,కర్మాగార,గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.బుధవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో టామ్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ, తహసీల్దార్ సతీష్ కుమార్,టామ్ కామ్ సంస్థ మేనేజర్ అనిల్ కుమార్‌లతో కలిసి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సరైన విద్యా అర్హతలు,నైపుణ్యాలు కలిగిన వారికి విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.ముఖ్యంగా జర్మనీ, జపాన్,ఇజ్రాయిల్‌తో పాటు గ్రీస్,యూరప్ దేశాల్లో నైపుణ్యంతో కూడిన ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉందన్నారు.ఆయా దేశాల అవసరాలకు అనుగుణంగా భాషా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టామ్ కామ్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.అర్హత,అనుభవం కలిగిన వారికి వారానికి 35 గంటల పని మాత్రమే ఉండటంతో పాటు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.యువతకు ఉపాధి కల్పించేందుకు మందమర్రిలో శిక్షణ కేంద్రం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.జూన్ 10 నుంచి ఉదయం,సాయంత్రం నాలుగు గంటల చొప్పున శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.నర్సింగ్,ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ తదితర రంగాల్లో నైపుణ్యంతో కూడిన అభ్యర్థులకు విదేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు రూ.90 కోట్లు మంజూరు చేసిందన్నారు.యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, విదేశీ భాషలను నేర్చుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తాము కష్టపడి సంపాదిస్తే కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోవచ్చని,సమాజంలో మరింత మందికి ఆదర్శంగా నిలవచ్చని అన్నారు.

మందమర్రి లో శిక్షణ శిబిరం ఏర్పాటు – కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల్లో భద్రత,సాంఘిక రక్షణ,కార్మిక చట్టాల పరిరక్షణ ఉండటంతో ఉద్యోగులకు మంచి భవిష్యత్ లభిస్తుందని చెప్పారు.స్థానిక యువతకు శిక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మందమర్రి లోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అర్హత,ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version