నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై పీడి యాక్ట్ కేసులు పెట్టాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు, విత్తనాలు అందించాలని నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని మంగళవారం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ ఇమ్మానుయేలు కు వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా గుండాల మాజీ సర్పంచ్ అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ ) జిల్లా నాయకులు కొమరం సీతారాములు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చెయ్యాలని, సకాలంలో రైతులకు బ్యాంకు రుణాలు అందేటట్లు చూడాలని, రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు మేనేజర్స్ కూడా రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా పంట రుణాలు ఇవ్వాలనిబ్యాంకు మేనేజర్లను కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) గుండాల మండల అధ్యక్షులు బచ్చల సారన్న, గడ్డం లాలయ్య, పెండ కట్ల పెంటన్న, బానోతులాలు, ఇసం సుధాకర్, చింత కోటేష్, కల్తి ప్రమోద్, పొడుగు జార్జ్ తదితరులు పాల్గొన్నారు.