
Government negligence...food poisoning
ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్
-కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేరుకే సంక్షేమం..గురుకులాలన్నీ సంక్షోభం
-కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు
-ఫుడ్ పాయిజన్ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి
-సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మండలం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కార్పోరేట్ స్థాయి విద్యను కొనలేని దీనస్థితిలో ఉండడాన్ని కళ్ళారా చూసిన మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 5వ తరగతి నుంచే గురుకులాల విద్యను పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అందుబాటులోకి తెచ్చి..ఆ గురుకులాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను పట్టించుకోకపోవడం వలన రాష్ట్రంలో ఏదో ఒకచోట రోజురోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుండడంతో..విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కొర్కిశాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో..చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో..గుట్టుచప్పుడు కాకుండా..విద్యార్థులను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుండగా..మీడియా మిత్రులకు సమాచారం తెలియగానే..మీడియా మిత్రులను పాఠశాలల్లోకి రానివ్వకుండా..గేటుకు తాళం వేసి..ఇంత పెద్ద సమస్యను దాచిపెట్టడానికి కుట్రలు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందని అన్నారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకే గురుకులాలు సంక్షేమమని, ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాలు సంక్షోభంలో కొట్టుమిట్టు లాడుతున్నాయని..గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే ఫుడ్ పాయిజన్ కు కారణమవుతున్నాయా..? లేకుంటే ప్రభుత్వమే విద్యార్థులను నిర్లక్ష్యంగా చూస్తుందా..? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్లక్ష్యంగా వదిలేసి..పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గురుకులాల్లో ఉడికి ఉడకని పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెట్టడం వలన ఇలా ఫుడ్ పాయిజన్ లు అవుతున్నాయని, కాంట్రాక్టర్లు, గురుకులాల ప్రిన్సిపాల్ లు కుమ్మక్కై విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అండగా ఉండి గురుకులాల్లో పేద విద్యార్థులకు పెట్టె భోజనంలో ఈ దందాను కొనసాగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొర్కిశాల కస్తూర్బా గురుకుల పాఠశాలలోని విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, మెనూ ప్రకారం భోజనం పెట్టని కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని అన్నారెడ్డి డిమాండ్ చేశారు.