జీతం చిల్లి గవ్వతో సమానం.. లంచం లక్షలతో తులా భారం!

-రోజు లక్షలు మూట కనిపిస్తుంటే జీతం తాలుతో సమాతూకం

-ఇక అధికారులు మారమంటే ఎందకు మారుతారు?

-లంచాలు వద్దంటే అధికారులెందుకూరుకుంటారు?

-పట్టుబడతామని భయమెందుకు పడతారు?

-ఏ అధికారి జీతం కోసం ఎదురు చూడడం లేదు!

-రోజూ సూట్‌కేస్‌ల తూకం చూసుకుంటున్నారు.

-జనాన్ని పీడిరచుకు తింటున్నారు!

-పట్టుబడినా రెండేళ్ల వరకు కేసు తేలకుండా చూసుకుంటున్నారు.

-దర్జాగా మళ్ళీ కొలువులు తెచ్చుకొని అదే సీట్లో కూర్చుంటున్నారు.

-పెట్టిన పెట్టుబడికి మళ్ళీ పదింతలు వసూలు చేసుకుంటున్నారు.

-సస్పెండ్‌ అయిన కాలాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

-విందులు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.

-సస్పెన్షన్‌ కాలానికి కూడా తర్వాత జీతాలు అందుకుంటున్నారు.

-జీవితాంతం కష్టపడినా రాని సంపాదన లంచాల రూపంలో పదేళ్లలో పోగేసుకుంటున్నారు.

-ఏసిబి ఎంత కష్టపడి పట్టుకున్నా కేసులు నిలబడక కొలువుకెక్కుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఉగాది పండుగ రోజు ఎవరైనా తప్పుడు పని చేయాలనుకుంటారా? తొలి పండుగ రోజు ఆత్మ వంచన చేసుకోవాలని ఎవరైనా చూస్తారా? అంటే కొంత మంది వుంటారు. మానవత్వం మర్చినవారు, మంచితనం లేని వారు వుంటారు. ఉగాది పండుగ రోజు లంచం తీసుకుంటే సంవత్సరమంతా లంచాల సంపాదన మూడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుందని ఆశించే దౌర్భాగ్యులు కూడా కొంత మంది వుంటారని తేలింది. ఓ అదికారి ఏకంగా ఉగాది నాడు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారంటే పరిస్దితి ఎంత దారుణంగా వుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు ఆ లంచంకూడా ఉగాది పండుగ రోజు కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. ఏసిబికి పట్టుబడ్డాడు. ఇక మరో ఇరిగేషన్‌ ఉద్యోగి ఓ వ్యక్తి భూమి ఎఫ్‌టీఎల్‌, భఫర్‌ జోన్‌లో లేదని ఎన్‌వోసి ఇవ్వడానికి శ్రీరారమ నవమి పండుగ రోజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నిజానికి ఈ రెండు రోజులు ప్రభుత్వ సెలవు రోజులు. అయినా ఆ లంచాల వతారులకు పండగ, పబ్బం, నీతి, నిజాయితీ, మంచి తనం అనేది మచ్చుకు కూడా లేదని తేలిపోయినట్లైంది. ఇలాంటి అధికారులు తెలంగాణలో ఎంతో మంది వున్నారు. పట్టుబడుతూనే వున్నారు. ఎందుకంటే కొంత మంది ఉన్నతోద్యోగులకు జీతం చిల్లిగవ్వతో సమానమైపోయింది. దాన్యంలో తాలుతో సమానమైపోయింది. జీతం అన్నది లెక్కలేకుండాపోయింది. ఎందుకంటే లంచాల ద్వారా జీతానికి పదుల రెట్లు నెలనెల సంపాదన అందుతోంది. అక్రమ సంపాదనకు పూర్తిగా అలవాటుపడిన కొంత మంది ఉద్యోగులు ఈ విధంగా లంచం లేనిదే పూట గడపడం లేదు. ఇది ఈ శాఖ, శాఖ అని తేడాలేదు. ఏశాఖలో చూసినా లంచావతారులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రజలను పీడిరచుకు తింటున్నారు. ఒకప్పుడు నెల జీతగాళ్లమని చెప్పుకునే అదికారులు ఇప్పుడు జీతం కోసం ఆలోచించే రోజులు ఎప్పుడో పోయాయి. లంచాల పేరుతో నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తూ, కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అలా లంచాలు తీసుకుంటూ దొరుకుతున్న వారు కేవలం ఒక్క శాతమే.. ఇంతగా ఏసిబి దృష్టిపెట్టినా అధికారులు లంచాలు తీసుకోవడం ఎందుకు మానుకోవడం లేదో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కళ్లమందు లక్షలకు లంచాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంటే ఊరికే పనులు ఎందుకు చేయాలన్న ఆలోచన అధికారుల్లో మొదలైంది. సంతకం పెట్టాలంటే, పెన్ను కదలాంటే లంచం అందాల్సిందే..లేకుంటే అదికారుకు కనికరం అనేది లేకుండా పోతోంది. వ్యవస్ధలన్నీ దిగిజారిపోతున్నాయి. ఏ శాఖలో చూసినా లంచమే కనిపిస్తోది. ఈ మధ్య పట్టుబడుతున్న వారిలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికులు వున్నారు. గత వారం రోజుల్లోనే వైద్య, రెవిన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌, ఆఖరుకు విద్యాశాఖకు చెందిన ఉన్నతోద్యోగులు పట్టుబడ్డారంటే ఎంతగా భరితెగించారో అర్దం చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి జీతం మీద లెక్కలేదు. జీతం ఆగిపోతుందన్న భయం లేదు. ఉద్యోగం పోతుందన్న భయం అసలే లేదు. ఎందుకంటే ఒక వేళ ఏసిబికి పట్టుబడినా, ఆ కేసును రెండు సంవత్సరాల పాటు కొనసాగేలా చేసుకంటే సరిపోతుంది. అప్పుడు న్యాయస్ధానమే ప్రభుత్వానిది తప్పని తేల్చి, లంచావతారులకు మళ్లీ పోస్టింగ్‌ ఇస్తుంది. చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో కొంత మంది లంచగొండులు ఆడుకుంటున్నారు. లంచం తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఉద్యోగం పోతుందన్న భయం లేదు. ఉద్యోగులు ఇంతలా దిగజారిపోతారని చట్టంచేసినప్పుడు ప్రభుత్వాలు అనుకోలేదు. రాజ్యాంగంలో పొందుపర్చినప్పుడు ఉద్యోగులకు హక్కులు కల్పించబడినప్పుడు పెద్దలు ఆలోచించలేదు. అది ఇప్పుడు ఉద్యోగులకు వరమైంది. ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా కాపాడుతోంది. వారి కొలువకు భరోసా కల్పిస్తోంది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలను కూడా లెక్క చేయడం లేదు. లంచాలకు మరిగి..మానవత్వం మరిచి! దిగజారిపోతున్న రెవిన్యూ వ్యవస్ధ. లంచాలు లేనిదే కొలువు చేయలేకపోతున్న ఉద్యోగులు. తహసిల్ధారుల మితిమీరుతున్న ఆగడాలు. రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు. రైతులు భూములు అమ్ముకున్నా కష్టమే? కొనుక్కున్నా లంచం ఇవ్వాల్సిందే. ఆఖరుకు తమ భూమి తమ పేరు మీద మార్చుకున్నా లంచమే. తహసిల్ధార్‌ సంతకం పెట్టాలంటే కూడా లంచమే. రైతుల రక్తం తాగుతున్నారు.. ఏసిబికి ఎంత మంది చిక్కుతున్నా భయపడడం లేదు. కేసులు పెడతారన్న ఆందోళన లేదు. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం అసలే లేదు. తప్పు చేస్తున్నామన్న భావన అసలే లేదు. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. చిన్నా, చితకా పని ఏదైనా సరే..లంచం ఇవ్వాల్సిందే. రైతులను అరిగోస పెడుతున్నారు. అయినా పట్టింపు ఎవరికీ లేదు. కొంత మంది తహసిల్ధార్‌లలో కనీసం మానవత్వం కరువైపోతోంది. ఎక్కడికక్కడ కొంత మంది తహసిల్ధార్‌లు ఏసిబికి పట్టుబడుతున్నా, మిగతా వాళ్లు భయపడం లేదు. కాసుల కక్కుర్తికి బాగా అలవాటు పడ్డారు. లంచాలు తీసుకోకుండా వుండలేకపోతున్నారు. లంచం తమ హక్కు అకునే స్ధాయికి దిగిజారిపోతున్నారు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. తహసిల్ధార్‌లు అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. రోజుకు లక్షల రూపాయల్లో లంచాలు వస్తుంటే, వారి ఆగడాలకు అడ్డూ అదుపేముంటుంది. రైతుల బలహీనతలను ఆసరా చేసుకొని వారికి మేలు చేస్తామని స్దానిక నాయకులు చెబుతుంటారు. నిజానికి ఏ సమస్య వచ్చినా నేరుగా తహసిల్ధార్‌ వద్దకు వెళ్లొచ్చు. కాని ఇప్పటికీ అధికార యంత్రాంగం అంటే ప్రజలకు కూడా భయమే వుంటుంది. ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టడానికి సామాన్యుడు ముందూ వెనుక ఆలోచిస్తూనే వుంటాడు. తమ సమస్యచెప్పుకుందామని వెళ్లినా ముందుగా అటెండర్ల నుంచే చిన్న చూపు ఎదురౌతుంది. సార్‌ లేడంటూ..లేదంటే పక్కన నిలబడంటూ…రేపు రాపో అంటూ అటెండర్లే రైతులను, ఇతర పనులపై వచ్చిన ప్రజలను గద్దిస్తుంటారు. దాంతో ప్రజలకు తమ పనులకోసం ఆ గ్రామంలోవున్న నాయకులను తీసుకొని వెళ్తుంటారు. నాయకులు మధ్య వర్తిత్వం వహిస్తుంటారు. సంబంధిత అధికారులతో బేర సారాలు చేసుకుంటారు. అప్పుడుగాని ప్రజలకు మోక్షం దొరకదు. ఇలా నిత్యం డబ్బుల మూటలు అందుతుంటే అదికారులు మారమంటే ఎందుకు మారుతారు? లంచాలు తీసుకోవద్దంటే ఎందుకు ఊరుకుంటారు? పట్టుబడతామని ఎందుకు భయపడతారు? పట్టుబడినా ఫరవాలేదని చాలా మంది అదికారులు తెగించేశారు. మహా అయితే ఓ నాలుగు రోజులు జైలుకెళ్తారు. అక్కడ ఇతర క్రిమినల్స్‌ వుంటే ట్రీట్‌ మెంటు వుండదు. అందువల్ల జైలు జీవితం అంటే పెద్దగా భయం కూడా వుండడంలేదు. రోజూ సూట్‌కేసుల తూకం కళ్లముందు కనిపిస్తుంటే, పట్టుబడితే కదా? అన్న ఆలోచన తప్ప, భయం వుండడడం లేదు. ఒక వేళ పట్టుబడి సస్పెండ్‌ అయినా ఎలాంటి బాధ వుండదు. ఎందుకంటే ఇవ్వాల కాకపోయినా రేపు తన ఉద్యోగం తనకు వస్తుందన్న బలమైన నమ్మకం. ఆ సస్పెన్షన్‌ కాలంలో హాయిగా విందులు, వినోదాలు, విహారయాత్రలు, వ్యాపారాలు చూసుకుంటున్నారు. మొత్తానికి చాలా మంది ఉన్నతోద్యోగులు తెగిస్తున్నారు. అందుకే నిత్యం ఎక్కడో అక్కడ పట్టుబడుతున్నారు. అందులో కూడా నిస్సిగ్గుగానే వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!