త్వరలో మళ్ళీ టిఆర్‌ఎస్‌!

`బిఆర్‌ఎస్‌ నుంచి యూ టర్న్‌.

`గూగుల్‌ కూడా టిఆర్‌ఎస్సే అంటోంది.

`క్యాడర్‌ అభీష్టం మేరకే…

`అతి త్వరలో శుభవార్త.

`నాయకులు కోరుతున్నది టిఆర్‌ఎస్సే.

`ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెం.1

`తెలంగాణ ఆత్మను నింపుకున్నది టిఆర్‌ఎస్‌.

`ఆత్మను వదులుకున్నట్లున్నది బిఆర్‌ఎస్‌.

`జనం సూచనలు చెవికెక్కించుకోండి.

`పదికాలాలపాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు.

`కార్యకర్తలు వందేళ్లు జెండా మోస్తారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిజంగా ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభవార్తే..తీయని సందేశమే… వేడుకలాంటి విశేషమే..ఎందుకంటే చాల కాలం తర్వాత మళ్లీ ఆత్మను గుండెల్లో నింపుకుంటున్నంత సంతోషం వ్యక్తమౌతున్నదే. బిఆర్‌ఎస్‌ భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌గా మారనుందన్న మాటే క్యాడర్‌లో సంతోషాన్ని నింపుతుంది. ఆనందం తాండవం చేస్తుంది. టిఆర్‌ఎస్‌ అన్న పేరు క్యాడర్‌కు ఇరవై రెండేళ్ల గుండెల నిండా నిండిన జెండా బంధం…రాజకీయానుబంధం. తెలంగాణ ప్రజలతో ఆత్మరుణానుబంధం. అది ఎవరూ తెంచేది కాదు. తెంచుకునేది అంతకన్నా కాదు. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా కొట్లాడిన పార్టీ టిఆర్‌ఎస్‌. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, పూరి గుడిసె నుంచి ఎత్తైన భవంతుల వరకు, సామాన్యుడి వాహనం సైకిల్‌, సంపన్న వర్గాల కార్లపై కూడా నిరంతరం ఎగిరిన జెండా గులాబి జెండా. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న జెండా టిఆర్‌ఎస్‌ జెండా. అదే తెలంగాణ ప్రజల అస్తిత్వం. ప్రాంత మమకారం. పిడికెలెత్తి నినదించిన నినాదం. తెలంగాణ ఆత్మగౌరవం. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ తరంగం. అంతటి త్యాగమయ చరిత్ర టిఆర్‌ఎస్‌కు వుంది. గులాబి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో రెపరెపలాడినా, చేతిలో కర్రపై ఆకాశాన్నందుకునేంతగా ఎరుగుతున్నా, ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షను తెలిసేలా చేసిన ఏకైక జెండా టిఆర్‌ఎస్‌ జెండా..గులాబి జెండా. అయితే ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌గా మారిందో అప్పుడే తెలంగాణ ఆత్మ దూరమైందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. పేరు మారితే బంధంలో ప్రకంపనాలొస్తాయని చెప్పారు…టిఆర్‌ఎస్‌ను మార్చొద్దని తెలంగాణ సమాజమంతా సూచించిందే…కాని తెలంగాణ ఆత్మగౌరవం,తెలంగాణ నాయకత్వం డిల్లీలో సగర్వంగా నిలబడాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌గా మారింది. కేసిఆర్‌ ఎంత వివరణ ఇచ్చినా, క్యాడర్‌ బలవంతంగా అంగీకరించినా ప్రజలు ఒప్పుకోలేదు. పార్టీ పేరుమార్పు జనం మెచ్చలేదు.  

 తెలంగాణ ఆత్మగౌరవం గులాబీ జెండాలో కనిపించిన, బిఆర్‌ఎస్‌ గులాబీలో కనిపించడం లేదు. 

అదే పెద్ద వెలితి. అందుకే ప్రజలు కూడా టిఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నంతగా బిఆర్‌ఎస్‌ను పెట్టుకోలేదన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఊహించని మెజార్టీని సొంతం చేసుకున్నది. ఉద్యమ కాలంలో సబ్బండ వర్గాలు ఎలా మద్దతు పలికాయో, 2018లో టిఆర్‌ఎస్‌కు అంతే మద్దతునిచ్చాయి. టిఆర్‌ఎస్‌ను గెలిపించాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అని ఆనాడు కాంగ్రెస్‌ ఎంత ప్రచారం చేసుకున్నా, ప్రజలు వినిపించుకోలేదు. కాంగ్రెస్‌ను ఇక నమ్మం అనే తేల్చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు డిపాజిట్లు కూడా రానంతగా టిఆర్‌ఎస్‌ నాయకులను బంపర్‌ మెజార్టీలతో గెలిపించారు. కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేశారు. రెండోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా వున్నా త్వరలో మళ్లీ టిఆర్‌ఎస్‌ అన్న పేరు వినిపంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, కేటిఆర్‌, హరీష్‌రావులు ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుందన్న దానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 ముఖ్యంగా కేసిఆర్‌ ఈ విషయంలో చాల ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజలు బిఆర్‌ఎస్‌ లో తెలంగాణ ఆత్మ లేదంటూ అప్పటి ప్రతిపాక్షాలైన కాంగ్రెస్‌, బిజేపి, బిఎస్పీలతో పాటు, యువత, విద్యార్దులు, తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు హెచ్చరిస్తూనేవున్నారు. టిఆర్‌ఎస్‌ అని తెలంగాణ వాదాన్ని ముందుపెట్టుకొని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్‌,బిజేపిలుచేసిన విమర్శలను ప్రజలు కూడా నమ్మినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసిఆర్‌ దేశ రాజకీయాల మీద దృష్టిపెట్టి తెలంగాణను పట్టించుకుకోకపోవచ్చన్న చర్చ కూడా సమాజంలో జోరుగానే సాగింది. అప్పటికే కేసిఆర్‌ పెద్దగా ప్రజల్లోకి వస్తున్నది లేదు. పైగా బిఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన చేసిన పర్యటనలు తెలంగాణ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నది కూడా తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎక్కడైనా పార్టీ పోటీ చేస్తుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేస్తామని చెప్పడం కూడా తెలంగాణ ప్రజలు మెచ్చలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే పద్నాలుగేళ్ల ఈ సుధీర్ఘ పోరాటానికి తెలంగాణ వాదానికి , త్యాగాలకు విలువేముందన్న అభిప్రాయంతెలంగాణ సమాజంలో వ్యక్తమైంది. తీరా ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ ఆగమౌతుందని కేసిఆర్‌ చెప్పినా ప్రజలు వినలేదు. బిఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటేయలేదు. గెలిచిన కాంగ్రెస్‌కు, ఓడిపోయిన బిఆర్‌ఎస్‌కు మధ్య ఓట్ల తేడా చిన్నదే అని ఎంత చెప్పుకున్నా ఓటమి అన్నది ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు పార్టీని, నాయకత్వాన్ని దూరం చేసినట్లే…అయితే బిఆర్‌ఎస్‌ ఓటమికి పూర్తిగా పేరు మాత్రమే కారణం కాదు. కాని బిఆర్‌ఎస్‌ ఓటమిలో పేరు కూడా ప్రధాన అంశమైందని చెప్పడంలో సందేహం లేదు. 

 ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ నుంచి టిఆర్‌ఎస్‌ యూటర్న్‌ కావాల్సిందే అని క్యాడర్‌ పట్టుబడుతోంది.

 లేకుంటే ప్రజల్లో చులకనౌతామని చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కేసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది నిజమే…కాని కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ అంటూ చేసిన ప్రచారం రేపు బిజేపి చేయకుండా వుండదు. కేంద్రంలో ఒక వేళ మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే తెలంగాణలో బిజేపి మరింత బలపడే అవకాశాలులేకపోలేదు. నిజానికి గతంలోనే బిజేపిని కేసిఆర్‌ పెంచిపోషిస్తున్నాడన్న విమర్శను కూడాఎదుర్కొన్నారు. కేంద్రలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా బిజేపి దెబ్బతీయదన్న గ్యారెంటీ లేదు. అంతే కాకుండా ఒక వేళ కాంగ్రెస్‌ను చీల్చే ప్రయత్నం బిజేపి చేస్తే, ఖచ్చితంగా బిఆర్‌ఎస్‌లో కూడా చీలిక తేకుండా వుండలేరు. అందువల్ల కేసిఆర్‌ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌ అంటూ గూగుల్‌ కూడా ఇష్టపడడం లేదు. గూగుల్‌కూడా టిఆర్‌ఎస్సే అంటోంది. క్యాడర్‌కూడా అదే కోరుకుంటోంది. ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెంబర్‌ వన్‌. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్షపాత్ర పోషించిననా టిఆర్‌ఎస్‌ జనంలో నానింది. అంతే కాదు నాడు ఆంధ్ర నాయకులను భయపెట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నది. తెలంగాణ ఆత్మను నింపుకున్నది. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ను చూసి భయపడిరది. తెలంగాణ ఇచ్చింది. అలాంటి టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఆత్మను వదులుకున్నట్లున్నట్లైంది. జనం చెబుతున్నది కూడా ఇదే. ఇప్పటికీ మించిపోయిందేమీలేదు. వెంటనే టిఆర్‌ఎస్‌గా మార్చితేనే ఎంతో మేలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం..అని వాయిదా వస్తే పార్లమెంటు స్ధానాలు దక్కకపోతే కాంగ్రెస్‌ చేసే రాజకీయం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. అందువల్ల టిఆర్‌ఎస్‌ అనండి. పది కాలాల పాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. వందేళ్లపాటు క్యాడర్‌ జెండా మోస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!