ఇబ్రహీంపట్నం, నేటి ధాత్రి
మండలంలోని, ఇబ్రహీంపట్నం, వర్షకొండ , కొండాపూర్, డబ్బా, గోధూర్, తిమ్మాపూర్, యామాపూర్, వేముల కుర్తి, అమ్మక్కపేట , గ్రామాల్లో కొలువుదీరిన అమ్మవార్లు తొమ్మిది రోజులపాటు ఆదిపరాశక్తి అపరావతారాలే నవ దుర్గలు, సప్త మాతృకలు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవ రాత్రులు. శుంభ, నిశుంభ, చండ, రక్త బీజ, మహిషాసుర, ధూమ్రలోచనాది రాక్షసులను మట్టుపెట్టి తన బిడ్డలైన ప్రజలనురక్షించిన అపరశక్తి స్వరూపిణి ఆ మాత.
జగన్మాత నవదుర్గలుగా రూపాలను దాల్చి రాక్షసులను హతమార్చింది. లోకమాతే స్వయంగా యుద్ధానికి దిగటానికి కారణం- ఈ రాక్షసులందరూ స్త్రీని అబలగా భావించి ఏ పురుషుని చేతిలోనూ మరణించకూడదని వరం పొందటం. అందుకే సకల దేవతల శక్తులనూ తాను పొంది పరాశక్తిగా రూపొందింది. బ్రహ్మదేవుని శక్తితో బ్రాహ్మిగా, మహేశ్వరుని శక్తితో మాహేశ్వరిగా, కుమారస్వామి శక్తితో కౌమారిగా, విష్ణుశక్తితో వైష్ణవిగా, వరాహస్వామి శక్తితో వారాహిగా, మహేంద్రుని శక్తితో మాహేంద్రిగా, కాళిక శక్తితో చాముండిగా అవతారాలు దాల్చి.. దుష్టశక్తులను చీల్చి చెండాడింది. అంతేనా! సప్త మాతృకలుగా వెలసి శిష్టులను రక్షించుకుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేది లోకసామాన్యం. కానీ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే.. రాక్షసులంటే వేరెక్కడో కాదు మనలోనే ఉగ్రతాండవం చేస్తున్నారు. అంటే మనలోని దుష్ట శక్తులూ, దుర్మార్గపు ఆలోచనలే మనల్ని రాక్షసులుగా చేస్తున్నాయి. చెడు మార్గంలో నడిపిస్తున్నాయి. మనలో దుర్మార్గం నశిస్తే మనసు సాత్త్వికమవుతుంది. అప్పుడు జగన్మాత సాక్షాత్కారిస్తుంది. అమ్మని పిలవాలి, కొలవాలి,
పూజించాలి,ధ్యానించాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.