భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ప్రజలు నిర్భయంగా మావోయిస్టుల ఆచూకీ సంభందిత సమాచారం, పోలీసులకు తెలపాలని, మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు అధికారులతో కలిసి ఎస్పి 10 మంది మావోయిస్టుల ఫొటోలతో ఉన్న వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ 10 మంది మావోయిస్టులపై 65 లక్షల నగదు రివార్డు ఉంది.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని, పోస్టర్‌లలో ఉన్నవారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, గోదావరి పరివాహక ప్రాంతంలో నిఘా పెంచామని, జిల్లాకు సరిహాద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయంతో పని చేస్తున్నామని, ఏదో ఒక ఘటన చేసి మావోలు తమ ఉనికి చాటు కోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తమకు సమాచారం ఉందని, అటవీ గ్రామాల్లోని ప్రజలు మావోయిస్టులకు భయపడవద్దని, గ్రామాలకు వస్తే వారి సమాచారం ఎస్పి భూపాలపల్లి 87126 58100, భూపాలపల్లి డిఎస్పీ, 87126 58103, కాటారం డిఎస్పీ 87126 58104 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, లేదా డయల్ 100 కు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పి తెలిపారు. మావోలను ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు శాఖ, సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి, జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనం గడపాలని ఎస్పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నారాయణ నాయక్, రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్సైలు పాల్గొన్నారు.