బాలికలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నత స్థాయిలో నిలువాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
బాలికలు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,అందరికీ ఆదర్శంగా నిలువాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ,శిశు,వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్,జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు.

బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాం కార్యక్రమంలో భాగంగా బాలికల సంరక్షణ కొరకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని,బాలికలకు అవకాశం ఇస్తే అన్ని రంగాలలో అద్భుతంగా ఆకాశాన్ని అందుకుంటారని అన్నారు.బ్రూణహత్యల నివారణ,బాల్యవివాహాల నియంత్రణ చర్యల ద్వారా బాలికలను రక్షించుకొని అణిచివేతకు గురి కాకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని, బాలికలకు జీవించే హక్కు, రక్షణ హక్కు,అభివృద్ధి హక్కు,భాగస్వామ్య హక్కు లాంటి ఎన్నో హక్కులను కల్పించడం జరిగిందని తెలిపారు.బాలికల రక్షణ కొరకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్ళాలని తెలిపారు.బేటి బచాబో – బేటి పడావో ద్వారా బ్రూణహత్యలను నియంత్రించి ఆడపిల్లల లింగ నిష్పత్తిని పెంచడం జరిగిందని,కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల ద్వారా తెలంగాణలో బాలిక విద్యను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, వివిధ వ్యాపారాలలో మహిళ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు.పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ బాలికలు సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలుసుకోవాలని,ప్రతి విషయంలో నైపుణ్యం పెంపొందించుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు.అనంతరం జాతీయ బాలిక దినోత్సవం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.బేటి బచావో- భేటీ పడావో ప్రతిజ్ఞ చేశారు.చదువుతో పాటు క్రీడలు,నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన బాలికలకు జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
