
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గౌడ కమ్యూనిటీ హాలులో ఉమ్మెంతల రవీందర్ రెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ పాలవర్గాలు అవలంబిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల హామీల అమలుకోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రభావం రోజురోజుకు తగ్గిపోతుందని అందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సొంతంగా బిజెపి అధికారంలోకి రాకపోవడం అని, ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గతప్రభుత్వ హయాంలో ప్రజలకు న్యాయం జరగడం లేదని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుటుంబ పాలన జరిగిందని, అన్ని సంక్షేమ పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించక పోవడం లాంటి అనేక వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి గెలిపించారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచిందని, అయినప్పటికీ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టడం లేదని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని, అన్ని ప్రభుత్వ రంగ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పుతూనే ఇప్పటికీ ప్రజలకు రేషన్ కార్డులు జారీ చేయలేదని, ప్రతి మహిళకు 2500ఇస్తామని చెప్పి ఇంకా అమలు చేయడం లేదని, ఉచిత కరెంటు అందిరికీ ఇవ్వడం లేదని, రైతుల భూసమస్యలు పరిష్కరించడం లేదని, రైతు ఋణ మాఫీ చేస్తామని కాలం గడుపుతున్నారే తప్ప అమలు పరచడం లేదని ఇలా అనేక హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజలను చైతన్య పరచి ఉద్యమాలకు సిద్ధం కాక తప్పదని హెచ్చరించారు. మండలంలో సీపీఐ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా గ్రామాల్లో తిరిగి పనిచేయాలని, పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామాలల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం అధికారుల వద్దకు తీసుకువెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటిసి స్థానాలను కైవసం చేసుకుందుకు ముమ్మరంగా పనిచేయాలని సీపీఐ శ్రేణులకు మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, టేకుమల్ల సమ్మయ్య మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, మౌలానా నాయకులు ఎగుర్ల మల్లేశం, మచ్చ నర్సయ్య, రాజన్న, రవీందర్, రాజేశం, కనుకయ్య, తదితరులు పాల్గొన్నారు.