₹5,000 Supari Attack Shocks Warangal
5 వేల సుపారీ కోసం గాంజా గ్యాంగ్ దాడులు..
వరంగల్ నగరంలో భయానక వాతావరణం..
రూ.5 వేల సుపారీ కోసం ప్రణాళికాబద్ధంగా దాడి.
బండరాయితో విచక్షణారహితంగా కొట్టి వీడియో చిత్రీకరణ.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసి సంచలనం.
నిందితులను పట్టుకున్న మిల్స్ కాలనీ పోలీసులు.
వరంగల్, నేటిధాత్రి.
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడి ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితులను కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై క్రైం నం. 244/2026 కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 140(4), 109(1), 118(1), 61(2), 49, 238 రెడ్ విత్ 190 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, మార్చి 17, 2026న ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాళ్లపెల్లి రాయలమ్మ (45), సురేష్ తన కుటుంబంపై అపవాదాలు చేస్తూ దూషిస్తున్నాడని భావించి, పసునూరి కల్యాణ్ (23)కు రూ.5 వేల సుపారీ ఇస్తానని ప్రలోభపెట్టింది. దీంతో కల్యాణ్ తన స్నేహితులు భానోతు జగన్ నాయక్ (16), పల్లపు నరేందర్ @ టింకు (20)తో కలిసి సురేష్‌ను కిరాణా దుకాణం వద్ద నుంచి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని కోటిలింగాల గుడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ కల్యాణ్ తన సెల్‌ఫోన్‌ను జగన్‌కు ఇచ్చి వీడియో చిత్రీకరింపజేస్తూ, సురేష్‌పై బండరాయితో దాడి చేసి, కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దినట్లు పోలీసులు తెలిపారు. దాడి తీవ్రతతో సురేష్ స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించి అక్కడే వదిలివెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, శివ మరియు పల్లకొండ జశ్వంత్ @ నాని (18) సహాయంతో బాధితుడిని ఆటోలో తీసుకువచ్చి ఇంటి సమీపంలో వదిలివెళ్లినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో పసునూరి కల్యాణ్, తాళ్లపెల్లి రాయలమ్మ, భానోతు జగన్ నాయక్ (జువెనైల్), పల్లపు నరేందర్ @ టింకు, పల్లకొండ జశ్వంత్ @ నాని లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా రాజ్‌కుమార్, శివ, పసునూరి సరిత పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి ఒక ఆటో, నాలుగు మొబైల్ ఫోన్లు, దాడికి ఉపయోగించిన బండరాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులపై గతంలో కూడా ఏనుమాముల మరియు గీసుగొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏఎస్పీ వరంగల్ ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది కలిసి వేగంగా స్పందించి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
