
Ganja Cultivation Found Amid Cotton Crop in Sangareddy
పత్తి పంటలో..”అంతర పంటగా గంజాయి సాగు”.!
◆:- రూ:1.70 లక్షల విలువ చేసే 17 గంజాయి మొక్కల స్వాధీనం, హద్దునూర్ పోలీసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, చాల్కి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. హద్దునూర్ ఎస్సై సుజిత్, సంగారెడ్డి క్లూస్ టీం హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. చాల్కి గ్రామానికి చెందిన ఉప్పరి గుండప్ప (75) గత కొంతకాలంగా తన వ్యవసాయ పొలంలోని పత్తిపంట సాగులో అంతర పంటగా.. గంజాయి సాగును చేస్తుండేవాడు.
నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక హద్దునూర్ ఎస్సై సుజిత్, సంగారెడ్డి క్లూస్ టీం పోలీస్ సిబ్బంది, వ్యవసాయ, గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. సాగులో ఉన్న పత్తిపంటను నిశితంగా పరిశీలించగా దాదాపు రూ:1.70 లక్షల విలువచేసే 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పంటపొలంలో సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు బ్యాటరీల వెలుగుల మధ్య నిశితంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దాడులు చేసిన వారిలో స్థానిక పోలీస్ కానిస్టేబుళ్లు రాజశేఖర్, రవి, మోహన్, పంచాయతీ కార్యదర్శులు రవికుమార్, ధనరాజ్, ఏఈఓ సాయి కిరణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.