శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచన
తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన డివిజన్ ప్రజల ఋణం తీర్చుకుంటానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల డాక్టర్స్ కాలనీ అభివృద్ధి పనుల కోసం గంగాధర్ రెడ్డి లక్ష రూపాయలు విరాళన్ని చెక్కు రూపేణా కాలనీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి కి అందజేశాడు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులను రప్పించి పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పరంగానే కాకుండా తనవంతు సాయంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. నా శక్తి వంచన లేకుండా ప్రజల అభిప్రాయం మేరకు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని డివిజన్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బుచి రెడ్డి, సంయుక్త కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.