రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
-చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఉంటదో ఉండదేమోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీకల్లోతు కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. బిజెపి, బీఆర్ఎస్ నాయకులు పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పూర్తి మెజార్టీని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన విషయం గుర్తేరుగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు, డబ్బులకు, ప్రలోభాలకు ఆశపడే రకం కాదన్నారు. కరుడుగట్టిన నిబద్ధత కలిగిన నాయకులే మా శాసనసభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గత పది సంవత్సరములు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని వ్యక్తి అని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల అంబేద్కర్ కు అవమానం జరిగిందని మాట్లాడడం కేసీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో మహానాయకుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించలేకపోయిందన్నారు. ఈ నెలలో సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, కొమరం భీం, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉండగా వాటిని కూడా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నందున నిర్వహించలేకపోయిందన్నారు. అంతేకాకుండా భద్రాచలంలో శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవానికి కూడా ఎన్నికల కోడ్ రావడం వలన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వెళ్లలేకపోయారని, వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవాన్ని వక్రీకరించి..తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం ఆయన ద్వంద నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.