చిత్తూరు/పలమనేరు,నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా లభించిందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ఆనాడు నష్టాల నుంచి నేడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమన్నారు.వేలాది మంది తెలుగువారు విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తనపై ఉన్న కేసుల నుంచి విముక్తి కల్పిస్తే చాలు రాష్ట్ర ప్రయోజనాలతో నాకు అవసరం లేదనే ధోరణితో తాకట్టుపెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు ఉండేవన్నారు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తీన పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తునే ఉండడాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదముద్ర వేయడం శుభపరిణామం అన్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి అప్పట్లో ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్ధ్యమున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయిందని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.1998లో నాటి ప్రధాని వాజ్ పేయ్ తో మాట్లాడి రూ.1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారని గుర్తు చేసారు.
ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగిందని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందన్నారు.
అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది.నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.