
BSNL towers.
*ఎట్టకేలకు తగిలిన సిగ్నల్..
*ఎంపి గురుమూర్తి కృషితో బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు మార్గం సుగమం..
తిరుపతి(నేటి ధాత్రి) ఆగస్టు 06:
తిరుపతి పార్లమెంటు పరిధిలోని గూడూరు నియోజకవర్గం పూడిరాయదొరువు, సూళ్ళురుపేట నియోజకవర్గం ఇరకం దీవిలో ఎట్టకేలకు బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. తీర ప్రాంత గ్రామాలైన పూడిరాయదొరువు, ఇరకం దీవిలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక తుఫాను వంటి అత్యవసర సమయాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలని అక్కడ పర్యటించిన సమయంలో స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ గురుమూర్తి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా సరిహద్దు, మారుమూల గ్రామాల్లో 4జి టవర్లను ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో, పూడిరాయదొరువు,ఇరకం దీవి గ్రామాలను కూడా ఆ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయాలని కోరడం జరిగింది. టవర్ల ఏర్పాటుకు బిఎస్ఎన్ఎల్ అంగీకారం తెలిపినా ఈ రెండు ప్రాంతాలు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉండటంతో, అటవీ శాఖ అనుమతులు అవసరమయ్యాయి.
ఇది టవర్ల ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారింది. తదుపరి తిరుపతి ఎంపి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ అనుమతులు, పూడిరాయదొరువు టవర్ కోసం విద్యుత్ కనెక్షన్ ఏర్పాటులో సమస్యలని బిఎస్ఎన్ఎల్ అధికారులు ఎంపీకి వివరించారు. స్పందించిన ఎంపి గురుమూర్తి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటుకు సదరు శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు.అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కి లేఖ రాశారు. కాగా శాఖా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపి గురుమూర్తి తెలిపారు. టవర్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో త్వరలోనే ఈ గ్రామాలకు నాణ్యమైన మొబైల్ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని హర్షం వ్యక్తం చేశారు.