Telangana Launches Fertilizer Booking App for Farmers
గూగుల్ ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని సమస్త రైతు సోదర సోదరీమణులకు, ఎరువుల డీలర్లకు తెలియజేయునది ఏమనగా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాబోవు యాసంగి పంట కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
తేదీ 20.12.2025 నుండి ఈ యాప్ లో రైతులు తమ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి ఓటిపి ద్వారా లాగిన్ కావాలి తర్వాత జిల్లాను ఎంచుకుంటే వివిధ సొసైటీలు లేదా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు కనిపిస్తాయి తమకు అనుకూలమైన మరియు అందుబాటులో ఉన్న సొసైటీలు లేదా డీలర్ వద్ద యూరియా బస్తాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసే క్రమంలో పంట సీజను,పట్టా పాస్ బుక్ నెంబరు,ఏ పంట ఎంత విస్తీర్ణం,పంట రకము నమోదు చేసుకోవాలి.పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా బస్తాలు తీసుకోవచ్చు. రైతుల బుకింగు కు 24 గంటల వ్యవధి ఉంటుంది. ఈ యూరియా బుకింగ్ విధానంలో ఒక ఎకరం వరకు ఒకేసారి ఒకటి నుండి 5 ఎకరాల వరకు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఐదు నుండి 20 ఎకరాల వరకు మూడు సార్లు 15 రోజుల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చు.
పాసుబుక్ లేని రైతులు ఆధార్ నెంబర్ ద్వారా యూరియా బస్తాలను పొందవచ్చు,కౌలు రైతులను కూడా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.
డీలర్లు కూడా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారి స్టాకు అమ్మకం వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
కావున నడికూడ మండల సమస్త రైతు సోదర సోదరీమణు లకు ఇట్టి విషయాన్ని తెలియపరుస్తూ మరియు సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు అందించబడదని తెలియజేయడమైనది.
గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ బుక్ చేసుకొని యూరియా బస్తాలను పొందగలరని తెలియపరచనైనది.
అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్న సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సంప్రదించవచ్చని మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ తెలిపారు.
