MP Slams Jagan Over Farmers’ Losses
జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
