
farmers
రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి…
వరి పంటలో కలుపు ను నివారించాలి…
పురుగులు,తెగుళ్ల నుండి కాపాడటానికి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి…
మోతాదుకు మించి యూరియా వాడటం ద్వారా చీడపీడల ఉధృతి అధికమవుతుంది…
రైతులు జింక్ సల్ఫేట్ ను వినియోగించాలి…
గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి…
నేటి ధాత్రి -గార్ల :-
రైతులు వరి పంట సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు అన్నారు.శనివారం మండల పరిధిలోని శేరిపురం గ్రామంలో వరి నాట్లు వేసే క్షేత్రాన్ని రైతులతో కలిసి సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రైతుల పంట పొలాల్లో జింక్ లోపం అధికంగా ఉన్నదని, రైతులు నాట్లు వేసే ముందు ఎకరాకు 20 కేజీల ముడీ జింక్ సల్ఫేట్ ను ఆఖరి దమ్ములో కాంప్లెక్స్ ఎరువులతో కలపకుండా విడిగా వేయాలని సూచించారు. జింక్ లోపం ఉండడం వలన మొక్కలో ఎదుగుదల లోపించి గిడసబారుతాయని తెలిపారు. రసాయన ఎరువులు మితంగా వాడాలని యూరియా మోతాదుకు మించి అధికంగా వాడటం వలన చీడపీడల ఉధృతి అధికమవుతుందని తెలిపారు.నాటు వేసే ముందు ఎకరాకు ఒక బస్తా డిఏపి కానీ 20-20-0-13 కానీ లేదా 2బస్తాలు సూపర్ పాస్పేట్ ను 25 కేజీల పోటాష్ తో కలిపి వేయాలని, రెండవ దఫా ఒక బస్తా యూరియాను నాటు వేసిన 20నుంచి 30 రోజులలో అర లీటర్ నానో యూరియా ను పై పాటుగా స్ప్రే చేయాలనీ సూచించారు.వరి చిరు పొట్ట దశలో 25 కేజీల యూరియా 25 కేజీల మూరెట్ ఆఫ్ పొటాష్ తో కలిపివేయాలని అన్నారు.మన భూములలో భాస్వరం నిలువలు అధికంగా పంటకు అందనిలేని స్థితిలో ఉన్నాయని వాటిని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తేవడానికి పాస్పో బ్యాక్టీరియాను వాడాలని, తద్వారా రైతులకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని అన్నారు.రైతులు యాజమాన్య,సస్యరక్షణ పద్ధతుల కొరకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ శేరిపురం విస్తరణ అధికారి రాజ్యలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు.