రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి…
నేటి ధాత్రి -గార్ల, నవంబర్
రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధ్యమని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు.మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేసిన వరంగల్ 44 (సిద్ధి)రకం వరి పంటను శనివారం క్షేత్రస్థాయి సందర్శన చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులు విత్తనాభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం ద్వారా సరఫరా చేసిన నాణ్యమైన విత్తనాలను తిరిగి రైతులందరూ వినియోగించుకోవాలని అప్పుడు మాత్రమే రైతులకు మేలైన విత్తనాలు లభిస్తాయని తెలిపారు.రైతు నుండి రైతుకు విత్తనాలు అందించడమే నాణ్యమైన విత్తనాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు.రైతులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని, గ్రామాలలో తిరుగుతూ విత్తనాలు అంటగట్టే అపరిచేత వ్యక్తుల వద్ద ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. అది కృత లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి పంట కాలం పూర్తి వరకు విత్తనాలకు సంబంధించిన రసీదును భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు.యాజమాన్య పద్ధతులు, సలహాలు, సూచనల కొరకు వ్యవసాయ అధికారులను,శాస్త్రవేత్తలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు,విస్తరణ అధికారి రాజ్యలక్ష్మి,రైతులు తదితరులు పాల్గొన్నారు.
