తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి…

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా చూడాలి

#వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

#వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు సంప్రదించాలి.

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు రోజుల పాటు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులను నిత్యం పర్యవేక్షిస్తూ ఏదైనా అత్యవసర మరమ్మతులు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు కార్యస్థానంలో ఉంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్‌ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు కూడా ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ, తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. లో లెవెల్ వంతెనలు, కాజ్ వేల మీదుగా వరద ప్రవాహం ఉన్న సమయాలలో రాకపోకలను నిషేధించాలని, చెరువులు, కాలువలు, నదులలో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్ళకుండా కట్టడి చేయాలన్నారు. వర్షాల వల్ల చెరువులు, కాలువ కట్టలు తెగి పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తిస్తూ, అవసరమైన సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆహారం, ఇతర సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వర్షాలతో వరద జలాలు ఏర్పడి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఏమైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్  సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version