గోదావరి జలాల కోసం రైతుల ఎదురు చూపులు

# రెండో పంటకు తైబందీ ప్రకటించడం సిగ్గుచేటు
# అవగాహన లేని ఎమ్మెల్యే మాధవరెడ్డి అధికారులతో ఒక్కసారైనా సమీక్షించారా..?
# గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగానేనా.? లేక ఈ ప్రభుత్వం మార్పు జరుగుతుందా..?
# సాగు నీళ్లు వస్తాయా..? రావా..? అని రైతుల ఆందోళన…!
# కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు, అధికారులు చెప్పే మాటలతో రైతుల అయోమయం.
# ప్రతీ ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే..
# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..

నర్సంపేట, నేటిధాత్రి :

యాసంగి పంటల సాగు సమయం దాటుతుండడంతో అందుకు సంబంధించిన సాగునీరు సరిపడా లేనందున నర్సంపేట నియోజకవర్గ రైతులు గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సంపేట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ
గత కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం,ప్రత్యేక ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి జలాలు తెచ్చి రెండు పంటలకు నీరందించామని పేర్కొన్నారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగు నీళ్లు రాలేదని అదే తరహాలో నేడు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రస్తుతం రెండో పంటకు సాగు నీళ్ళు
వస్తాయా…? రావా…? అని రైతులు ఆందోళన చెందుతున్నారని అవేదన వ్యక్తంచేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేటకు గోదారి జలాలు తెస్తానని ప్రజలకు నేను మాట ఇస్తే పాఖాలకు గోదావరి జలాల ప్రాజెక్టు బూటకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారని అది నేడు అదే నాయకులు జీర్ణించుకోలేక పోతున్నానని అన్నారు.గోదారి జలాలతో సస్యశ్యామలంగా మారిన నర్సంపేట డివిజన్ పట్ల ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులతో ఒక్కసారైనా సమీక్షించారా..? అసలు ఎన్ని ప్రాజక్టులు ఉన్నాయో కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు తెలుసా అని పెద్ది ప్రశ్నించారు.
గతంలో పూడుకుపోయిన కాలువలకు పూడిక తీసి సమృద్ధిగా నీళ్లు కాలువల ద్వారా పారించామని తెలిపారు.నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మా ప్రభుత్వంలో రైతులు ఏనాడు నీళ్లు రావటం లేదని అడిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఉన్నప్పటికి, ఇప్పుడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీళ్లు ఎందుకు రావటంలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలన్నారు.నియోజకవర్గంలో డీబీఎం 38, 40, 48 కాలువల ద్వారా 50 వేల ఎకరాల పైచిలుకు పంటలు సాగులో ఉండేవని నేడు అదే నీరు ఆ కాలువల ద్వారా ఎందుకు రావటంలేదని అడిగారు. బోర్లు, బావులు ఉన్న రైతులు కాలువ ద్వారా వచ్చే నీళ్లు వాడొద్దని సంబంధిత అధికారులు అంటున్నారని
తెలిపారు.నర్సంపేట నియోజకవర్గ ఇరిగేషన్ అధికారే నీళ్లురావని,పంటలు వేసుకోవద్దనీ ప్రకటన ఇచ్చారని ఒక వైపు కాంగ్రెస్ నాయకులు విడుదల చేసిన ప్రకటనలు,అధికారులు చెప్పే మాటలతో రైతులు అయోమయంలో ఉన్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.ఎమ్మెల్యే సమీక్షించి 100 శాతం తైబంది కరారు చేసి,నార్లు పోసిన తర్వాత విష ప్రచారం చేస్తున్నారని,ఎమ్మెల్యే తక్షణమే నియోజకవర్గ సాగునీటి పై ఇరిగేషన్, రెవెన్యూ అధకారులతో సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తైబంది నిర్ణయించిన అధికారులు తక్షణమే స్పందించి,బాధ్యతతో రైతులకు సమాధానం చెప్పాలని
దేనిని బేస్ చేసుకుని తైబంది ఇస్తామని అంటున్నారో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్పాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకట నారాయణ గౌడ్,ఎంపిపి వేములపెల్లి ప్రకాష్ రావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,నాయకులు బండి
రమేష్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *