Farmers Struggle for Urea Amid Supply Delays
రైతులకు తప్పని… యూరియా తిప్పలు..
#రాత్రి వేళలో యూరియా కోసం రైతులపడి గాపులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
గత నెల రోజులుగా మండలంలో యూరియా కోసం రైతుల అగచాట్లు సమసిపోవడం లేదు. ఈసారి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, వరి పంటల సాగు గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడంతో పంటలకు అధిక మొత్తంలో యూరియా వాడకం ఉండడంతో రైతులు యూరియా బస్తాల కోసం నాన ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరగడంతో రైతులు వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి. వేకువ జాము నుండే యూరియా బస్తా కోసం ప్రభుత్వ ఆగ్రోసుల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి పడి గాపులు కాస్తున్నారు. రాత్రి వేళలో సైతం కేంద్రాల వద్ద రైతులు పడుకున్న సంఘటనలు సైతం ఉండడం గమనార్వం.
#యూరియా కొరత లేదు.
రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వశాఖ సంబంధిత అధికారులు సైతం రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియాను అందించడం జరుగుతుందని చెప్పినప్పటికీ అది మాటలకే పరిమితం అవడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని ప్రతిపక్ష పార్టీలు, రైతులు గగ్గోలు పెడుతున్న యూరియా కొరత నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రైతులు వాపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్షలు జరపకుండా గాలికి వదిలేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ప్రజా సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు రైతులు పడుతున్న కష్టాలను గమనించి పంటలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
