వినాశనకర విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు

# వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలో.. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :

రైతుల వ్యవసాయం దివాలాతీసి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం పాలకుల వినాశనకర విధానాలేనని అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. రైతాంగాన్ని రక్షించి దేశాన్ని కాపాడాలంటే తక్షణమే కనీస మద్దతు ధరల చట్టం రైతు రుణముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఏఐకేఎఫ్ జాతీయ కమిటీ పిలుపు మేరకు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈసందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతులు పంటలు పండించడానికి అయ్యే ఉత్పత్తి ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గి పండిన పంట ధరలేక తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు సంక్షోభంలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తగిన సహకారం అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది విస్మరించి కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలను రూపకల్పన చేసి రైతులు వ్యవసాయం చేయలేని స్థితికి నెట్టివేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలనైనా చిత్తశుద్ధితో అమలు చేస్తారని ఆశపడితే అది అడియాశగానే మిగులుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది రైతాంగం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుచేసి మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలను తీసుకురావాలని సంవత్సరంపైగా పోరాడితే రాతపూర్వక హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఆచరణలో విస్మరించడం సిగ్గుచేటన్నారు.ఇప్పటికైనా తక్షణమే డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రైతులు పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరారు. రైతులకు హాని కలిగించే కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కుంటి సాకులతో రెండు లక్షల రుణమాఫీని అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. రైతుల పెట్టుబడికి ఉపయోగపడే రైతు భరోసాను నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూమాత పేరుతో కొత్త రెవిన్యూ ముసాయిదాను తీసుకువచ్చిన ప్రభుత్వం రైతుల కమతాలవారీగా డిజిటల్ సర్వే చేపట్టడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. అకాల అధిక వర్షాలతో రైతాంగం వేసిన పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారని అలాంటి వారిని ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలన చేసి ఎకరాకు కనీసం 30 వేల రూపాయల సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల హామీలను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలని లేకపోతే రైతాంగ ఉద్యమాలు ఉధృతం కాక తప్పదని హెచ్చరించారు.అనంతరం రైతు సమస్యల డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని కలెక్టర్ కు సమర్పించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యులు గోనె కుమారస్వామి, ఎఐసిటియు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్ర ప్రతాప్, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, రాష్ట్ర నాయకులు నాగేల్లి కొమురయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కేశెట్టి సదానందం జిల్లా నాయకులు ఐతం నాగేష్ అల్లి సాబ్ సోమిడి రవి మల్లేష్ సారయ్య సాంబయ్య భారతి మాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!