# నిరుపేద వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం.
#కుటుంబ భారం మోస్తూ అనుకున్నది సాధించే వరకు విశ్రమించని విక్రమార్కుడు.
నర్సంపేట/దుగ్గొండి, నేటిధాత్రి:
చదువే అతని ప్రాణం… పదిమందికి చదువు నేర్పి ఉన్నత శిఖరాలపై ఉంచడమే అతని లక్ష్యం..
ఆ దిశగానే చిన్నతనం నుండి చదువుపై మక్కువ పెంచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమిస్తూ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాడు పట్టు పట్టు విడవని విక్రమార్కుడిగా ఒక నిరుపేద వ్యక్తి మహేందర్ కక్కేర్ల.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సామాన్య నిరుపేద కుటుంబం వారిది. కక్కెర్ల పార్వతమ్మ సారయ్య గౌడ్ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన మహేందర్ బాల్య విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల దుగ్గొండిలో పదవ తరగతి వరకు కొనసాగింది. అనంతరం పై చదువుల కోసం వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్లి చదువుకునే స్తోమత లేకపోవడంతో తనకు చదువు నేర్పిన గురువు సురేష్ అలియాస్ మహమ్మద్ భుజం తట్టి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతో డిగ్రీ వరకు పూర్తి చేశాడు.కుటుంబ పరిస్థితి దృశ్య వివాహం జరగగా కుటుంబ పోషణ భారం కావడంతో ట్యూషన్లు చెప్పుకుంటూ ఒక వైపు కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చదువుకుంటూ ముందుకు సాగాడు. 2010లో ఎంఈడి పూర్తి చేసి 2015లో ఎన్ ఈ టి ఉత్తీర్ణత పొందాడు. 2020లో తమిళ్ టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో ఉన్నత విద్య పి హెచ్ డి పూర్తి చేసి డాక్టరేట్ పొందాడు. అంతటితో ఆగకుండా తన లక్ష్యం అయిన ప్రొఫెసర్ ఉద్యోగం కోసం తపన పడుతూ ఖాళీ సమయంలో ప్రైవేటు కాలేజీలో విద్యాబోధన చేస్తూ ఎట్టకేలకు తాను అనుకున్న ప్రొఫెసర్ ఉద్యోగాన్ని హర్యానా రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలో పొంది విధులను నిర్వహిస్తున్నాడు. అలాగే తనతో పాటు తన భాగస్వామిని కూడా పిహెచ్ డి చదివించి 2021లో ఆమె కూడా డాక్టరేట్ పొందింది. అలాగే ఇద్దరు కవల పిల్లలు సైతం సరస్వతి పుత్రికల జన్మించి చదువులో రాణిస్తూ పదవ తరగతిలో జిల్లాలో టాపర్ గా నిలిచారు. ఇలా ఒక్కడితో మొదలైన విజయపరంపర కుటుంబం మొత్తం సరస్వతి దేవితో కళకళలాడుతూ విజయ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.
# ఈ విజయం నా కుటుంబ సభ్యుల అంకితం..
నేను ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులు అలాగే నా భార్యా పిల్లల సంపూర్ణ సహకారం లేకపోతే నేను ఈ స్థాయికి చేరే వాడిని కాను. అంతేగాక నా కుటుంబ సభ్యులు, మిత్రులు, తోటి ఉద్యోగస్తులు, నా ఊరి ప్రజల పూర్తిసహకారంతోనే నేను ఈ స్థాయికి రాగలిగాను. నా ఎదుగుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలాగా చదువుకునే ప్రతి వ్యక్తికి నా వంతు విద్యను బోధిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ వారిని అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా తీర్చిదిద్దుతానని మహేందర్ తెలిపారు.గ్రామంలో చదువుకునే యువతకు తన వంతు బాధ్యతగా ఉన్నత విద్య కోసం ఈ విధంగానైనా కృషి చేసి నా ఊరి రుణం తీర్చుకుంటానని మహేందర్ కక్కేర్ల సంతోషం వ్యక్తం చేశాడు.