ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కరువు
ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నర్సంపేట,నేటిధాత్రి:
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం మహమ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ ఓట్లు సీట్లు అధికారం కోసం అనేక ఆశాజనకమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని అరకొర అమలు చేసి గొప్పగా ప్రచార ఆర్భాటం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆదానిలాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాల రూపొందిస్తూ హక్కుల కోసం పోరాడే శ్రామికులపై నియంతృత్వంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తుండగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ వైఫల్యాలను బూచిగా చూపించి ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రజా పోరాటాలను చేపట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రజా ఉద్యమం : పెద్దారపు రమేష్
చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లా పాలకుల వైఫల్యంతో ఎంతో వెనుకబడి ఉన్నదని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలను చేపట్టి అవినీతి అక్రమాలు భూ కబ్జాలపై ఎక్కడికక్కడ స్పందించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పోరాటాలు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి,మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా నాయకులు కుసుంబ బాబూరావు, వంగల రాగసుధ,నాగెల్లి కొంరయ్య, కనకం సంధ్య,మహమ్మద్ రాజాసాహెబ్,కొత్తకొండ రాజమౌళి, సింగతి మల్లికార్జున్,కేశెట్టి సదానందం, గటికె జమున,ఐతమ్ నగేష్,ఎగ్గెని మల్లికార్జున్,ఎల్లబోయిన రాజు,మాలి ప్రభాకర్,అప్పనపురి నరసయ్య,బత్తిని కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.