వెల్డర్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపణ
జైపూర్, నేటి ధాత్రి:
సింగరేణిలో నూతనంగా వెలువడిన ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్ లో వెల్డర్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఐటిఐ లో వెల్డర్ కోర్స్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులలో ఒకరైన జైపూర్ మండలం కాన్కూర్ వాసి గుడుగుల సాగర్ అభ్యర్థుల తరఫున మాట్లాడుతూ ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్ లో ఒక్క వెల్డర్ పోస్ట్ కూడా కేటాయించలేదని, వెల్డర్ పోస్ట్ లు లేకుండా సింగరేణి చరిత్రలో మునుపెన్నడు నోటిఫికేషన్ విడుదల కాలేదని, ఇదే మొదటిసారని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ విడుదల కాక నిరుద్యోగంతో కుటుంబాలు గడవక ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మా కష్టాలు తీరి ఉద్యోగాలు దొరుకుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మాకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా కష్టాలను గుర్తించి సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని వెల్డర్ పోస్టులు కేటాయించాలని కోరుకుంటున్నారు.