యుద్ధమా! అస్త్ర సన్యాసమా?

-ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళంలో ఉత్కంఠ.

-అయోమయంలో గులాబీ నేతలు.

-పోటీ సిద్దపడుతున్న వారిపై పెరుగుతున్న ఒత్తిడి.

-పోటీ చేస్తామని చెప్పలేక, చేయమనలేక సందిగ్ధత.

-కరీంనగర్‌ నుంచి మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఆసక్తి.

-అధినేత ఆదేశాల కోసం ఎదురుచూపులు.

-బిజేపి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన.

-క్షేత్ర స్థాయిలో జోరుగా ప్రచారం.

-కాంగ్రెస్‌ పార్టీ కోసం క్యూ కడుతున్న అభ్యర్థులు.

-ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వంద స్థానాలు గెలుస్తామంటారు.

-ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు.

-పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు.

-మరోపక్క ఓడిపోతామేమో అని లోలోన భయాలు.

-పార్లమెంటు ఎన్నికల ఓటమి నుంచి ఇంకా బైటపడని గులాబీ దళం.

-ఎమ్మెల్సీ ఎన్నికలు పంచాయతి ఎన్నికలపై ప్రభావంపై ఆలోచనలు.

-పంచాయతి ఎన్నికలలో గులాబీ జెండాతో గెలిచినా పార్టీలోనే వుంటారన్న నమ్మకం లేదు.

-ఎమ్మెల్యేలే జారిపోతున్నారు.

-అభివృద్ధి పేరుతో పంచాయతి ప్రజా ప్రతినిధులు జారుకోరా!

-ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోతే శ్రేణులలో నమ్మకం సడలుతుంది.

-పోటీ చేస్తే ప్రజలలో ఆర్‌ఎస్‌ మీద నమ్మకం నిగ్గు తేలుతుంది.

-ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిస్తే దూకుడు పెంచేందుకు మరింత వీలౌతుంది.

-ఓడిపోతే ఇంకా ఎక్కడ లోపం జరుగుతుందో అర్థమవుతుంది.

-మౌనంగా వుంటే భయపడుతున్నారని అనుకుంటారు.

-కాంగ్రెస్‌ ఆరోపణలే నిజమనుకుంటారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ యుద్దం చేస్తుందా? లేక అస్త్ర సన్యాసం చేస్తుందా? అన్నది ఇప్పటకీ అంతు పట్టడం లేదు. పార్టీ నిర్ణయం ఇంత వరకు వెలువడలేదు. కనీసం ఎలాంటి సంకేతాలు కూడా పంపించడం లేదు. పోటీ చేద్దాం సిద్దంగా వుండడి. లేకుంటే ఎన్నికల గురించి ఎక్కడా ప్రస్తావించకండి? అనే ఏదో ఒక విషయం తేల్చి చెప్పినా పార్టీ శ్రేణులు ప్రశాంతగా వుండేవారు. కాని అవతల పార్టీలైన కాంగ్రెస్‌ , బ బిజేపిలు ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో దూకుడుగా వున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే వంద సీట్లు గ్యారెంటీ అని చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏటూ తేల్చుకోలేకపోతోంది. ఎలాంటి ప్రకటనలు చేయలేకపోతోంది. దాంతో ఎన్నికలు ఎన్నికలు అంటూ లెక్కలు చెప్పిన బిఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదంటేనే భయపడుతుందని కాంగ్రెస్‌,బిజేపిలు దెప్పి పొడిచే అవకాశాలు లేకపోలేదు. ప్రజల్లో బిఆర్‌ఎస్‌ స్ధానం లేదు..ఆ విషయం బిఆర్‌ఎస్‌ పెద్దలకు తెలుసు. అందుకే పోటీ చేయడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేసే అవకాశాలు కూడా వున్నాయి. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో బిఆర్‌ఎస్‌ను చెడుగుడు ఆడుకోకుండా వుండలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇది ఒక మంచి అవకాశంగా మారుతుంది. అయితే ఇప్పడే కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ మీద ఎలాంటి ప్రకటనలు చేయదు. ఎన్నికల్లో పోటీ చేయమని బిఆర్‌ఎస్‌ను రెచ్చగొట్టదు. ఎన్నికల నామినేషన్ల ఘట్టం అయిపోయేదాకా కాంగ్రెస్‌ కొంత వ్యూహాత్మక మౌనం వహిస్తుంది. అప్పుడు బిజేపి కోసమే బిఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదని సరికొత్త రాజకీయాన్ని తెరమీదకు తెస్తుంది. బిఆర్‌ఎస్‌ను అప్పుడు ఇరుకున పెడుతుంది. బిజేపి కూడా సరిగ్గా ఇదే ఫార్ములా అనుసరిస్తుంది. బిఆర్‌ఎస్‌ను రెంటికీ చెడిన రేవడిగా మార్చుతాయి. అందువల్ల బిఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు సిద్దపడాలి. లేకుంటే ఇంకా బిఆర్‌ఎస్‌ శ్రేణులు అయోమయానికి గురౌతారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్‌ఎస్‌లో చాల మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఉద్యమ పార్టీగా, పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన పార్టీగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకడుగు వేస్తే భవిష్యత్తులో ప్రజలు కూడా సానుభూతి చూపించే అవకాశం వుండదు. ప్రజల మద్దుతు కోసం నష్టనివారణ చర్యలు చేపట్టడం అంత సులువు కాదు. రెండు జాతీయ పార్టీలే కాదు తెలంగాణలో అనేక పార్టీలు పోటీ చేసేందుకు సిద్దంగా వున్నాయి. బిఎస్‌పి కూడ పోటీలో నిలుస్తోంది. కమ్యూనిస్టులు కూడా సవాలు విసురుతున్నారు. ఇలాంటి సమయంలో బిఆర్‌ఎస్‌ చేతులెత్తేస్తే చేయి పార్టీకి ఎమ్మెల్సీలను పూల బుట్టలో పెట్టి అందించినట్లే అవుతుంది. తమ పార్టీ ఎమ్మెలీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? చేయదా? అన్నది తేల్చుకోలేక, సరైన సమాచారం లేక శ్రేణులు సందిగ్ధావస్తలో వున్నారు. అయితే ఇదిలా వుంటే కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా వున్నారు. పార్టీ కాదన్నా ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు కూడా సిద్దమౌతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే పట్టభద్రుల ఎన్‌రోల్‌ మెంటు కార్యక్రమం విసృతంగా చేపట్టారు. ఆయనకు తెలిసిన, పరియస్తులతో టచ్‌లో వున్నారు. వారి ఓట్లు ఆయనుక అనుకూలంగా కూడా వున్నాయి. ఇప్పుడు ఆయనను పార్టీ వద్దంటే నాయకుడిగా ఆయనకు ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతాయి. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో నోటిఫికేషన్‌ కూడా వచ్చే అవకాశం వుంది. గతంలో ఇవే స్ధానాలలో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు ఓడిపోయారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఉనికినే కోల్పోయింది. కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేక చతికిలపడిరది. అంతే కాకుండా చాలా చోట్ల కారు పార్టీ మూడో స్దానానికి పరిమితమైంది. ఆ మధ్య జరిగిన వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఆది నుంచి అభ్యర్ధుల ఎంపికలో కూడా బిఆర్‌ఎస్‌ తప్పటడుగులు వేస్తూ వచ్చింది. ఓటమి సుడిగుండంలో నిండా మునిగిపోయి వుంది. ఇప్పుడే కోలుకునే పరిస్దితి కనిపించడం లేదు. ప్రజల నాడి ఇప్పటికీ ఎవరికీ అంతు పట్టడం లేదు. పైకి బిఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేకతను ఎంత ప్రమోట్‌ చేయాలని చూసినా, ప్రజల్లో పెద్దగా నిరసనలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు తెరమీదకు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా వుంటుంది? చేయకపోతే ఎలా వుంటున్నదానిపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. దానిపై కేసిఆర్‌ ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. మౌనం వీడడం లేదు. అధికారంలో వున్నప్పుడు జనం ముందుకు రాలేదు. జనం సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడైనా ప్రజల ముందుకు వస్తున్నారా? అదీ లేదు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ దుమ్మెత్తిపోస్తుందన్న భయంతో నాయకుడు బైటకు రావడం లేదన్న సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. పార్టీ శ్రేణులు కూడా బలంగా మాట్లాడేందుకు కూడా ముందూ వెనుక ఆలోచిస్తున్నారు. పార్టీ అదినేత నోరు విప్పితే , తాము కూడా విమర్శలు మొదలు పెట్టొచ్చని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కేసిఆర్‌ పెద్దగా పట్టించుకోలేదు. పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్దానాలు సాధించి డిల్లీ స్ధాయిలోనైనా రాజకీయం చేద్దామనుకున్నారు. కాని ప్రజలు బిఆర్‌ఎస్‌ను డిల్లీ గడప తొక్కకుండా చేశారు. కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌ దాటి బైటకు రాకుండా తీర్పిచ్చారు. దాంతో అప్పటి నుంచి ఆయన బైటకు వచ్చింది లేదు. జనాన్ని చూసింది లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కాలు జారి పడిపోయాడు. అలా కొంత కాలం రెస్టు తీసుకున్నాడు. కాని పార్లమెంటు ఎన్నికల ముందు జనం ముందకు వచ్చారు. కాని వర్కవుట్‌ కాలేదు. కేసిఆర్‌ మాటలు ప్రజలు నమ్మలేదు. బిజేపిని నమ్మినంతగా కూడా బిఆర్‌ఎస్‌ను నమ్మకపోవడంతో పార్టీలో తీవ్ర నైరాశ్యం నిండిపోయింది. అందుకే కేసిఆర్‌ కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా హజరు కావడం లేదు. ఈ ఏడాదంతా ఎన్నికల వాతావరణమే కనిపిస్తుంది. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగునున్నాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో ఈ స్ధానం నుంచి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. ఫలితాలు అధికార పార్టీకే ఎక్కువ అనుకూలంగా వుండే అవకాశం వుంది. ఇక రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అదే సమయంలో రానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే అయినా ఉద్యోగాలు కల్పించిన పేరు కాంగ్రెస్‌ పార్టీకే దక్కింది. గతంలో ఎప్పుడూ బిఆర్‌ఎస్‌ ఇన్ని ఉద్యోగాలు ఏక కాలంలో ఇచ్చిన దాఖాలాలు లేవు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం సుమారు 60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందన్న పేరు వచ్చింది. దాంతో నిరుద్యోగులు, పట్టుభద్రులు,ఉద్యోగుల కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం వుంది. ఇటీవల ఉపాద్యాలైన వారు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేసే అవకాశం వుంది. దాంతో బిఆర్‌ఎస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచే అవకాశాలు తక్కువ. ఇక రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌కే అనుకూలంగా వున్నాయనే మాట వినిపిస్తోంది. గత ప్రభుత్వం జోన్ల మూలంగా 173 జీవో మూలంగా ఉపాద్యాయులు జిల్లాలు దాటి పోవాల్సి వచ్చింది. ఇది వారిలో బిఆర్‌ఎస్‌ మీద తీవ్ర కోపంతో వున్నారు. వాళ్లు ఇంకా బిఆర్‌ఎస్‌పై సానుభూతితో లేరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచేందుకు ఉద్యోగులు ఎంతో సహకరించారు. అందులో ఉపాద్యాయులు కూడా వున్నారు. అలాంటి పరిస్దితులను తట్టుకొని గట్టెక్కడం అంటే బిఆర్‌ఎస్‌కు కష్టమే. అన్న అభిప్రాయం కూడా అక్కడక్కడ వ్యక్తమౌతోంది. కాని ప్రచారాలకు ప్రజల ఆలోచనలు, తీర్పులకు తేడా వుండొచ్చు. ప్రజలు బిఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపొచ్చు. ఎప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో ఊహించడం ఎవరి వల్లకాదు. అదే జరిగితే ఈ ఎన్నికల వ్యవస్తే వుండేది కాదు. అందువల్ల ఎన్నిలంటే పార్టీలు భయపడితే పార్టీల మనుగడ మాత్రం ప్రశ్నార్ధకమౌతాయి. బిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ వెనుకడగుడు వేస్తే మొదటికే మోసం వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!