హరిచంద్ తండాలో ఎక్సైజ్, పోలీస్ అధికారుల దాడులు
అదుపులో ముగ్గురు వ్యక్తులు
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని హరిచంద్ తండాలో నాటు సారా తయారీ, విక్రయాలు బహిరంగంగా కొనసాగుతున్నాయన్న సమాచారంతో నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో, స్థానిక నెక్కొండ సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్ వారి బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల గుడుంబా పానకం, 50 కిలోల బెల్లం, 10 కిలోల పట్టిక, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రాజావత్ రాము, జాటోతు కిట్టయ్య, జాటోతు బిక్షపతి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సారా, ఇతర సామగ్రిని నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేస్తూ, గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు చేపట్టే సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
