అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్ ఐఏఎస్
జనగామ, నేటిధాత్రి:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం నెల్లుట్ల గ్రామపంచాయతీ, బచ్చన్నపేట, జనగామ పట్టణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు, అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రం, లింగాల ఘణపురం మండల కేంద్రాలలో జరుగుతున్న సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ,
ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణ కోసం నియోజకవర్గానికి మండలానికి గ్రామస్థాయికి ప్రత్యేక అధికారుల నియమించి కార్యక్రమాలు పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. గ్రామాలలో పట్టణంలో దరఖాస్తు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆడవారికి, మగవారికి వేరువేరుగా క్యూలైన్లను సిద్ధం చేశామని, దరఖాస్తులు అందజేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, త్రాగునీరు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాలు, పట్టణంలో ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం కలిగించేందుకు సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సుహాసిని, ప్రజా పాలన ప్రత్యేక అధికారులు, వారికి కేటాయించిన నియోజకవర్గ పరిధిలోని సిబ్బందికి ఈరోజు శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ తెలిపారు.