
అందరూ ఒకే ఫార్మాట్లో నివేదికలెలా ఇచ్చారు
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.
- కొన్ని నివేదికలపై నోడల్ అధికారుల సంతకాలు లేవు
- వాస్తవికతను తేల్చేందుకు అడ్వొకేట్ కమిటీ వేస్తాం
- పోలీసుస్టేషన్లలో సీసీకెమెరాల ఏర్పాటుపై నిలదీసిన హైకోర్టు
స్టేషన్ మొత్తం కనిపించేలా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సర్టిఫై చేస్తూ ఎస్డీపీవోలు(డీఎస్పీలు) ఇచ్చిన నివేదికలపై హైకోర్టు ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఎస్డీపీవోలందరూ ఒకే ఫార్మాట్లో నివేదికలు ఎలా సమర్పించారని ప్రశ్నించింది. కొన్ని జిల్లాల నివేదికలపై సంబంధిత జిల్లాల నోడల్ అధికారుల సంతకాలు లేవని, వారి బదులు ఇతర అధికారులు సంతకాలు చేశారని తెలిపింది. మంగళవారం ఓ హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా విజయవాడ మూడవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఒక సీసీ కెమెరా మాత్రమే ఉన్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేసింది. అయితే, స్టేషన్ను వ్యక్తిగతంగా తనిఖీ చేసి ఠాణా మొత్తం కవర్ అయ్యేలా సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్లు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సర్టిఫై చేస్తూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. పరస్పర భిన్న నివేదికల నేపథ్యంలో ఎస్డీపీవోలు సమర్పించిన నివేదికల వాస్తవికతను తేల్చేందుకు అడ్వొకేట్ కమిటీని ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలీసుస్టేషన్లలో పర్యటించి రాణాలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? స్టేషన్ మొత్తం కనిపించేలా ఏర్పాటు చేశారా?లేదా? తదితర అంశాలపై కమిటీ నుంచి నివేదిక కోరతామని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్ని స్టేషన్లలో సీసీకెమెరాలు ఏర్పాటు చేయలేదో వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్సజీపీ)ని ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ జగడం సుమతితో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఆ మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలుకాకపోవడంతో యోగేష్ 2022లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడుజిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారంటూ కటారు నాగరాజు గతేడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీకెమెరాల ఏర్పాటు జరగలేదన్నారు. రాష్ట్రంలో 1392 పోలీసుస్టేషన్లు ఉండగా, 1001 పోలీసుస్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్సజీపీ) టి.విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లాక్పలు ఉన్న అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.