రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలంలో గల టోల్ ప్లాజా వద్ద 37వ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు – 2026 పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎ.సి.పి. రవికుమార్,జాతీయ రహదారుల సంస్థ జి.ఎం.(టి) & పి.డి. కె.ఎన్. అజయ్ మణికుమార్ లతో కలిసి వాహనదారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత మరణానికి గురవుతున్నారని,ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుందని తెలిపారు.వాహనాన్ని వేగంగా నడపడం,పరిమితికి మించి లోడ్ తో ప్రయాణించడం కారణంగా వాహనాలు అదుపు తప్పుతాయని, అందువలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం,జాతీయ రహదారిపై వాహనాలను నిలుపుదల చేయడం, పశువులను రహదారిపైకి వదలడం చేయవద్దని,ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు. జాతీయ రహదారుల సిబ్బంది రహదారి నియమ, నిబంధనలను పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని,రహదారులపై పని చేసే సిబ్బంది సైతం పని చేసే సమయంలో సేఫ్టీ కిట్స్ ధరించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ సరైన కండిషన్ లో ఉన్న వాహనాన్ని మాత్రమే ఉపయోగించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,డ్రైవింగ్ చేస్తూ 5మొబైల్ లో మాట్లాడవద్దని, ట్రాఫిక్ భద్రత నియమాలను పాటించాలని తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నామని, రహదారులపై వేగ నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచికలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
