మందమర్రి జీఎం మనోహర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క మహిళ రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని మందమర్రి ఏరియా జీఎం మనోహర్ అన్నారు.శుక్రవారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి లో ఆసుపత్రి ఏసిఎంఓ డాక్టర్ ఉషా రాణి అధ్యక్షతన బసవతారకం ఇండో అమెరికన్ హాస్పటల్ హైదారాబాద్ వారు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ను ఏర్పాటు చేయగా ముఖ్య అతిదులుగా మందమర్రి ఏరియా జీఏం మనోహర్ దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జీఎం మనోహర్ మాట్లాడుతూ…. రొమ్ము క్యాన్సర్ అనునది ప్రపంచవ్యాప్తంగా స్త్రీలలో సంబభవించే క్యాన్సర్లలో అత్యంత సాధారణమైన క్యాన్సర్ అని తెలిపారు. సాధారణంగా మహిళలు రొమ్ముకి క్యాన్సర్ ను ఎవరికి తెలియపరచని కారణంగా చివరి దశలో ఆసుపత్రికి వెళితే ఉపయోగముండదని మొదటి దశలోనే ఆసుపత్రులకు వెళ్లి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. సింగరేణిలో పనిచేసే మహిళా కార్మికురాళ్ళు, ఉద్యోగుల కుటుంబాల మహిళలకు సింగరేణి సంస్థ, సిఎండి బలరాం నాయక్ ఒక మంచి అవకాశాన్ని కల్పించారని, ఈ అవకాశాన్ని మహిళా ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఏరియా ఆసుపత్రిలో సుమారు 100 మంది మహిళలు స్క్రీనింగ్ టెస్ట్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు.రొమ్ము పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న గడ్డలుగా ప్రథమ దశలో ఉన్నపుడే జాగ్రత్త పడి వెంటనే వైద్యులను సంప్రదిస్తే రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు అని, సిగ్గు,బిడియాలతో ఎవరికి చెప్పకుండా ఉంటే వ్యాధి ముదిరి ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెపుతున్నారని తెలిపారు.దగ్గర్లోని సింగరేణి ఆసుపత్రి,డిస్పెన్సరిలలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.బసవతారకం ఆసుపత్రి వైద్యులు నిర్వహించే వైద్య శిబిరాన్ని 45 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్క సింగరేణి మహిళా ఉద్యోగి,కుటుంబసభ్యులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్,ఆసుపత్రి వైద్యులు ప్రసన్న కుమార్,రాజ్ కుమార్, ఏఐటియుసీ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ ఆలీ,ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్,బసవతారకం ఆసుపత్రి వైద్యులు,కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.