Every Vote Matters in Nyalkal Panchayat Polls
ప్రతి ఓటు కీలకమే…….!
◆-: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు
◆-: న్యాల్కల్ మండలంలో జోరందుకున్న పంచాయతీ పోరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పల్లెల ప్రగతికి పంచాయతీ ఎన్నికలే కీలకం. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాల్సిందే. ప్రతి ఓటు అత్యంత కీలకమే. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక రోజు మాత్రమే అవకాశం ఉందంటూ.. మండలంలోని అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల సర్పంచులు, వార్డు సభ్యులు విజయమే లక్ష్యంగా.. ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ ముఖ్య నేతలు బి.శ్రీనివాస్ రెడ్డి, కే.భాస్కర్ రెడ్డి, విపక్ష పార్టీ ముఖ్య నేతలు ఎం.రవీందర్, మల్లేష్ గంగువార్, తదితరుల మద్దతుతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల అభ్యర్థులకు దీటుగా పలువురు స్వతంత్ర అభ్యర్థుల సైతం ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
న్యాల్ కల్,17న పంచాయతీ ఎన్నికలు..తుదివిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీలో ఈ పాటికే 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 35 గ్రామ పంచాయతీల ఎన్నికలు ఉ: 7గం నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఓటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి కౌంటింగ్ చేపట్టి
ఫలితాలను వెల్లడించనున్నారు. హోరా హోరీగా ప్రచారం..
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నువ్వా.. నేనా.. అన్నట్టు హోరా హోరీగా ప్రచారాన్ని హెూరెత్తిస్తున్నారు. మండలంలోని డప్పుర్, ముంగి, న్యాల్ కల్, హద్దునూర్, మల్లి, మామిడిగి, రేజింతల్, మిర్జాపూర్ (ఎన్), మెటల్ కుంట, హుస్సేన్ నగర్, శంషాల్లాపూర్, తదితర గ్రామాల్లో అధికార, విపక్ష పార్టీ మద్దతు దారుల అభ్యర్థులు జోరుగా ఇంటింటి, వాహనాలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలు తీరుస్తాం అంటూ హామీలను గుప్పిస్తున్నారు. మద్యం, మనితో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఏకంగా
ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
స్వతంత్ర అభ్యర్థుల సైతం ముమ్మర ప్రచారం…..
మండలంలోని మల్లి, ఇబ్రహీంపూర్, అత్నూర్, వడ్డీ, న్యాల్ కల్, హద్దునూర్, తదితర గ్రామాల్లోని పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పూర్తి చేసిన అభ్యర్థులు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి దిగంబర్ నేరుగా.. నన్ను గెలిపించండి మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ.. రూ:100 స్టాంప్ పేపర్ పై వ్రాసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అటు అధికార.. ఇటు విపక్ష పార్టీ మద్దతుదారులకు దీటుగా.. విజయమే లక్ష్యంగా మల్గి గ్రామానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి బిల్లాపూర్ విట్టమ్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి ప్రచారంతో.. అభ్యర్థుల జయాపజయాలపై తీవ్ర ప్రభావం చోటు చేసుకోనుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరింతగా నాయకులు, ఆశావాహులు అధిక మొత్తంలో ప్రచారంలో పాల్గొని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు
