మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామ్యం కావాలని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జిఎం గురువయ్య, ఏరియా జిఎం ఏ మనోహర్ లు సూచించారు. సింగరేణి 54వ రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్ జిఎం గురువయ్య ల ఆధ్వర్యంలో రక్షణ తనిఖీ బృందం గురువారం ఏరియాలోని శాంతిఖని గనిని సందర్శించారు. ఈ సందర్భంగా రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ డి లలిత్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో అతి తక్కువ ప్రమాదాలు నమోదు అయ్యాయని, దీనికి కృషిచేసిన కార్పొరేట్ సేఫ్టీ జిఎం గురువయ్యకు అభినందనలు తెలిపారు. అనంతరం ఏరియా జిఎం ఏ మనోహర్ మాట్లాడుతూ, రక్షణ కోసం ఉద్యోగులు ఆధునిక సాంకేత పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను, పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. అనంతరం గత సంవత్సరం నిర్వహించిన 53వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో గెలుపొందిన మొదటి బహుమతిని సేఫ్టీ అధికారి రాజు కు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా కమ్యూనికేషన్ సెల్ కళాకారులు అండర్ గ్రౌండ్ సపోర్టింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లఘు నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి ఎం రవీందర్, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ విజయప్రసాద్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, గని రక్షణాధికారి రాజు, సేఫ్టీ కమిటీ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.