జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగుతుండగా.. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, యువకులు జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప-ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గెలుపు కోసం విశేషంగా కృషి చేశామన్నారు. అయినప్పటికీ తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో డబ్బులకు ఆశ పడకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వచ్ఛందంగా ఈటల వెంట ఉంటూ పని చేసామని చెప్పారు. జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన సుమారు 100 మంది రాజీనామా చేశామన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి కుమారస్వామి, మహమ్మద్ జానీ, రాపర్తి అఖిల్ గౌడ్, పొన్నాల అనిల్, మార్క అరవింద్, బండారి సాగర్, పిట్టల అనిల్, రుద్రవేణ సుధాకర్, ఎరబాటి రమేష్, ఉప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.