హైడ్రాపై ఈటెల హైడ్రామా!

-పదే పదే ఈటెల చిందులు!

-ఈటెలొక్కడే హైడ్రా వద్దంటున్నాడు!

-బిజేపి ఎంపిలంతా భేష్‌ అంటున్నారు!

-బిజేపి ఎంపిలందిరిదీ ఒక దారి!

-ఈటెలొక్కడిదీ మరో దారి!

-ఈటెల మాటల్లో మతలబేంది!

-ఈటెలొక్కడికే కలుగుతున్న నొప్పేమిటి!

-చెరువుల రక్షణ తప్పా!

-ఆక్రమణల కూల్చివేత అన్యాయమా!

-ఉలికిపాటులో వున్న వారికే కలవరపాటు!

-చెరపట్టిన వారిలోనే కనిపిస్తున్న దిగులు.

-పదేళ్లలో భూములు పలహారం చేసుకున్నదెవరు?

-భూములు మింగి బుల్డోజర్లకు భయపడుతున్న వారెవరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 హైడ్రా( హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఎజెన్సీ) తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆహ్వనిస్తున్నారనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో మా భూములు మాకేనని అంటూ కొన్ని లక్షల సార్లు పాటలు పాడిన వారున్నారు. విన్న వారున్నారు. ఆ రోజులు రావాలని ఎదురుచూస్తున్నవారున్నారు. కాని గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ వచ్చేదాక ఒక పాట పాడిరది. వచ్చాక ఒక పాట పాడిరది. తెలంగాణ రాకముందు అయ్యోనివా..నువ్వు అవ్వోనివా..అంటూ పాటలు పాడిరచారు. గుంటూరులో గుంట జాగడితిమా? అంటూ చెప్పారు. తెలంగాణలో ఆక్రమణలకు గురైన చెరువులను రక్షిస్తామన్నారు. హుస్సేన్‌ సాగర్‌ను మంచినీటి సరస్సును చేస్తామన్నారు. కాని ఏం చేశారు. బిఆర్‌ఎస్‌ నాయకులే ఈ పదేళ్లలో చెరువులను చెరపట్టారన్నది తేలిపోతోంది. అంతే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంత నాయకులు, రియలెస్టేట్‌ వ్యాపారులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఖాళీ స్దలాలను ఆక్రమించుకున్నారన్న ఆరోపనలు అనేకం వున్నాయి. అందులో భాగమైన ఎన్‌ కన్వెన్షన్‌ లాంటి వాటిపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. చెరువును ఆక్రమించి నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను కట్టారన్నది నిజం. అలాగే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంతో మంది చేతుల్లో తెలంగాణకు చెందిన విలువైన భూములు లక్షల ఎకరాల్లో వున్నాయన్నది అందరికీ తెలిసిందే. అప్పటి ప్రభుత్వాలను మేనేజ్‌ చేసుకొని చెరువులను, ప్రభుత్వ భూములను చెరపట్టారన్నది భహిరంగ రహస్యమే. మరి అలాంటి భూములను రక్షించే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టడం అందరూ స్వాగతిస్తున్నారు. కాని తెలంగాణలోని పిడికెడు మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓ వైపు తెలంగాణ మొత్తం హైడ్రాను ఏదో రూపంలో విస్తరించమని ప్రభుత్వాన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. కాని కొందరు నాయకులకు మాత్రం హైడ్రా పేరు వింటేనే గుండెల్లో బుల్డోజర్లు పరుగెత్తుతున్నాయి. దాంతో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

హైడ్రా పనితీరును చూస్తున్న తెలంగాణ ప్రజలు జరిగిన విద్వంసాన్ని సరిచేయమని పెద్దఎత్తున కోరుతున్నారు. ప్రకృతి విధ్వంసానికి కారణమైన వారిని శిక్షించాలని కూడా కోరుతున్నారు. నాయకులు, పలుకుబడి చెందిన వ్యక్తుల చేతుల్లో బంధీలైన చెరువుల చెర విడిపించమని అంటున్నారు. కొందరి కబంధహస్తాలలో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించమని కోరుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ప్రజలకు ఎంతో సంతోషాన్నిస్తుంటే, కొందరు నాయకులకు మాత్రం కంటకింపుగా మారింది. అన్యాయం జరుగుతోందని గయ్యిమంటున్నారు. గుండెలు బాధుకుంటున్నారు. కొంపలంటుకుపోయినట్లు గగ్గోలు పెడుతున్నారు. ఆగమాగమౌతున్నారు. తెలంగాణ ఆగమైపోతుందని చిత్రీకరించే దుష్ట పన్నాగం పన్నుతున్నారు. తెలంగాణ అభివృద్ది కుంటుపడిపోతుందని కలవరపాటును ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా తాము సుద్దపూసలమన్నట్లు, ప్రజలకు మేలు చేసేందుకే మేమున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. పైగా ఎక్కడ బుల్డోజర్లు తమ మీదకు వస్తాయో? అన్న భయం కనిపిస్తుండడంతో గాయిగాయి చేస్తున్నారు. అలాంటి వారిలో బిజేపి ఎంపి. ఈటెల రాజేందర్‌ ముందున్నారనే చెప్పాలి. అదేంటో గాని బిజేపిలో వున్న మిగతా ఎంపిలంతా హైడ్రాను సమర్దిస్తున్నారు. కొనసాగించాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి అండగా నిలస్తామని, కేసులు వాదిస్తామని మెదక్‌ ఎంపి. రఘునందన్‌రావు ప్రకటిస్తున్నారు. భూములు చెరపట్టిన వారిని, చెరువులను చెరిపేసిన వారిని వదిలిపెట్టొద్దని, మధ్యలో ఆపేయొద్దని మిగతా బిజేపి ఎంపిలు కోరుతున్నారు. కాని హైడ్రా వల్ల పేదల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఈటెల రాజేందర్‌ ఒక్కడే రివర్స్‌లో మాట్లాడుతున్నారు.

ఏడుగురు బిజేపి ఎంపిలు హైడ్రా పనితీరును అభినందిస్తుంటే, ఒక్క ఈటెల రాజేందర్‌ మాత్రమే ఎందుకు తప్పు పడుతున్నారన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఈటెల రాజేందర్‌ మాత్రమే ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి, ఆరేళ్ల పాటు మంత్రి పదవిలో వున్న ఎంపి. ఈటెల రాజేందర్‌ భూముల ఆక్రమణ కేసులోనే బిఆర్‌ఎస్‌ పార్టీని వీడాల్సివచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే బిఆర్‌ఎస్‌ నుంచి గెంటివేయబడ్డారు. ఈటెల రాజేందర్‌కు సహజంగానే అతి విశ్వాసం ఎక్కువ. అదే ఆయనను పదే పదే ఇబ్బందులకు గురిచేసినా, ఆయన తీరు మారదు. ఏ భూముల ఆక్రమణ ఆరోపణలతో బిఆర్‌ఎస్‌ నుంచి ఈటెల రాజేందర్‌ బిజేపిలో చేరారు. ఈటెల రాజేందర్‌పై గత ప్రభుత్వం ఆరోపణలు సందించింది. పార్టీ నుంచి పంపించేసింది. కాని పెద్దగా చర్యలు తీసుకోలేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలు పెట్టిన హైడ్రా యజ్ఞం ఖచ్చితంగా ఈటెల భూములపైకి వెళ్తుందన్న సంకేతాలు ఇప్పటికే ఆయనకు చేరాయి. అందుకే ఆయన మిగతా ఎంపిలకు భిన్నంగా ప్రకనటలు చేస్తున్నారు. గాయి గత్తర చేయాలని చూస్తున్నాడు. కోరికోరి కష్టాలు తెచ్చుకోవడం ఈటెల రాజేందర్‌కు అలవాటు. బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు తన స్ధానాన్ని అతిగా ఊహించుకున్నాడు. పార్టీ నుంచి బైటకు పంపేలా చేసుకున్నాడు. సరిగ్గా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో గోక్కున్నాడు. బిజేపిలోకి వచ్చిన తర్వాత బండి సంజయ్‌ను కెలికాడు. అప్పుడు బిజేపిలో వున్న ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి సాయం చేసినా, ఆయనతో కయ్యం పెట్టుకున్నాడు. మొత్తం మీద ఈటెల రాజేందర్‌ అంటే అయ్యో అనేవాళ్లు లేకుండా చేసుకున్నాడు. స్వయం కృతాపరధాధంతో పదే పదే తనను తాను దిగజార్చుకుంటూ వస్తున్నాడు. హైడ్రా తన మీదకు ఎక్కడ వస్తుందో అని ముందే ఉలిక్కిపడి, తొందరపడి నోరు జారుతున్నాడు. బుల్డోజర్లు తన మీదకు వచ్చేలా చేసుకుంటున్నాడు. 

ఇదే హైడ్రా విషయంలో బిజేపి ఎంపిలు ఎక్కడా కలుగజేసుకోవడం లేదు. తప్పని అనడం లేదు. పేదల జోలికి మాత్రం వెళ్లొద్దని చెబుతున్నారు. చెరువుల పరిరక్షణ కోసం జరుగుతన్న చర్యలను సమర్దిస్తున్నారు. తమ సహాకారాన్ని పరోక్షంగా అందిస్తూనే వున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమింటే తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు, భూములను ఆక్రమించిన వాళ్లు అటు కాంగ్రెస్‌లోగాని, ఇటు బిజేపిలో గాని పెద్దగా లేరు. ఎందుకంటే పదేళ్లపాటు వాళ్లు అదికారంలో లేరు. కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇటీవలే అదికారంలోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ నుంచి బిజేపికి వెళ్లిన వాళ్లో, కాంగ్రెస్‌కు వెళ్లిన వాళ్లపైనే ఆరోపణలున్నాయి. అందువల్ల అటు బిజేపి నాయకులుగాని, ఇటు కాంగ్రెస్‌ నాయకులుగాని పెద్దగా కలవరపడాల్సిన అవసరం ఏర్పడం లేదు. కాని పదేళ్లపాటు అధికారంలో వున్న వాళ్లు, ఆ పార్టీని వదిలిన వాళ్లు ఆక్రమించుకున్న భూములే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఈటెల రాజేందర్‌కు ఇబ్బందిగా మారింది. ఎక్కడ తన భూములు కోల్పోవాల్సివస్తుందో అన్న దిగులు మొదలైంది. ఒక రకంగాచెప్పాంటే ఇంతకాలం బిజేపిలో అసలైన నాయకులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన ఈటెల రాజేందర్‌ పరిస్దితి ఏమిటన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈటెల భూములు ఎన్ని ఎకరాలు కోల్పోతారో చూద్దామన్న ఆసక్తితోనే బిజేపిలో అనేక మంది నాయకులు కూడా వున్నారు. ఈ దెబ్బతో ఈటెల రాజకీయం కూడా ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొవాల్సివస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *