వన్య ప్రాణుల దాహం కోసం ముదిగుంట అడవిలో నీటి గుంత ఏర్పాటు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని అటవీ ప్రాంతంలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్ డీసీ)ఆధ్వర్యంలో నీలగిరి ప్లాంటేషన్ లు పెంచుతున్న అటవీ ప్రాంతం మధ్య లో నుంచి వెళ్లే చిన్న వాగులో ఒక మూల ప్రాంతం లో ఉన్న కొద్ది పాటి నీటి కోసం వన్య ప్రాణులు వస్తూ ఉండేవి కాగా గత కొద్ది రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో అక్కడ ఉన్న కొద్ది పాటి నీరు అడుగంటి పోవడం తో వన్య ప్రాణులు తమ దాహం తీర్చు కోవడం కోసం అల్లాడి పోయేవి.ఈ ఎండలకు మనుషులే తట్టుకోలేక విలవిల్లాడుతున్న తరుణం లో ఆ మూగజీవుల వెతలు వర్ణనా తీతం. ఈ పరిస్థితిని చూసి అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది కి వచ్చిన ఆలోచన తో వన్య ప్రాణుల దాహం తీర్చడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని సంకల్పించారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ,మంచిర్యాల రేంజ్ పరిధిలోని, జైపూర్ మండలం ముదిగుంట నీలగిరి ప్లాంటేషన్ ల మధ్యలో ఉన్న వాగులో ఒక పక్కన గుంత తీసి పూడిక తీసే కార్యక్రమం గురువారం చేపట్టారు.ఈ విషయం లో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్, జైపూర్ మండలం ఎంపీడీఓ జి. సత్య నారాయణ సహకారం కోరారు.దీంతో ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్, కొంత మంది జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల సహకారం తో శ్రమించి ఆ వాగులో ఒక పక్కన వెడెల్పుగా గుంత తీసి అందులో పూడికను తొలగించడం తో నీళ్లు వచ్చాయి. దీంతో వన్య ప్రాణుల దాహం కొరత ను తొలగించడం జరిగింది. ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ వన్య ప్రాణుల కోసం అటవీ ప్రాంతం లోని ఈ వాగులో నీటి పునరుద్దరణ కోసం వాచర్ శంకర్ చూపిన చొరవ, ప్రయత్నాలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!